రిలయన్స్​ నుంచి ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు

రిలయన్స్​ నుంచి ఆసియాలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు
  • రూ.10 వేల కోట్ల పెట్టుబడి  
  • 930 మెగావాట్ల కరెంటు తయారీ​

హైదరాబాద్​, వెలుగు: ఆసియా ఖండంలోనే మొట్టమొదటిసారిగా  అతిపెద్దదైన సోలార్  బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్​ఎస్) యూనిట్ నెలకొల్పుతామని రిలయన్స్​పవర్​ ప్రకటించింది. ఇందుకోసం రిలయన్స్ పవర్ లిమిటెడ్ అనుబంధ సంస్థ రిలయన్స్ న్యూ సన్‌‌ టెక్ ప్రైవేట్ లిమిటెడ్ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సెకీ)తో 25 సంవత్సరాల దీర్ఘకాలిక కరెంటు కొనుగోలు ఒప్పందం (పీపీఏ)పై సంతకం చేసింది.

ఈ ప్రాజెక్ట్ కోసం రూ. 10 వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడిని ప్రకటించింది.  ప్రాజెక్టును రాబోయే 24 నెలల్లో అభివృద్ధి చేసి ప్రారంభించనుంది.  సంప్రదాయ ఇంధన వనరులపై ఆధారపడటాన్ని తగ్గించి, పర్యావరణ అనుకూలమైన ఇంధన ఉత్పత్తిని ప్రోత్సహించే ప్రభుత్వ లక్ష్యానికి ఈ ప్రాజెక్ట్ ఒక గొప్ప ఊతం ఇస్తుందని రిలయన్స్​పవర్​ ప్రకటించింది.

ఈ యూనిట్‌‌లో అత్యాధునిక సోలార్ ప్యానెల్స్,  బ్యాటరీ స్టోరేజ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఇది సోలార్​ కరెంటు‌‌ను నిల్వ చేసి, అవసరమైనప్పుడు సరఫరా చేయడానికి అందుబాటులో ఉంచుతుంది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ (బీఈఎస్​ఎస్) కరెంటు గ్రిడ్  స్థిరత్వాన్ని మెరుగుపరుస్తుంది. సోలార్​ కరెంటు ఉత్పత్తిలో అంతరాలను అధిగమించి, నిరంతరాయంగా కరెంటు సరఫరాను అందించడానికి ఇది దోహదపడుతుంది. 

ఈ ప్రాజెక్ట్ ద్వారా 930 మెగావాట్ల సోలార్ విద్యుత్‌‌ను ఉత్పత్తి చేస్తారు.  ఉత్పత్తి చేసిన విద్యుత్‌‌ను నిల్వ చేయడానికి 465 మెగావాట్ల సామర్థ్యం కలిగిన బ్యాటరీలు (1,860 మెగావాట్-గంటల నిల్వ) ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్ట్‌‌లో ఉత్పత్తి చేసే విద్యుత్‌‌ను ఒక స్థిరమైన ధరతో, అంటే ఒక యూనిట్‌‌కు రూ.3.53 చొప్పున విక్రయిస్తారని కంపెనీ తెలిపింది.