సి - విజిల్ ఫిర్యాదులను ..తక్షణమే పరిష్కరించాలి

సి - విజిల్ ఫిర్యాదులను ..తక్షణమే పరిష్కరించాలి

ఆసిఫాబాద్, వెలుగు : సి–విజిల్ ద్వారా అందిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఆసిఫాబాద్ కలెక్టర్ బొర్కడే హేమంత్ సహదేవరావు అధికారులకు సూచించారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సెంటర్లను మంగళవారం అడిషనల్ కలెక్టర్ దీపక్ తివారితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థంగా నిర్వహించాలన్నారు.

సి– విజిల్ యాప్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో ఉండే ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలకు చేరవేసి వెంటనే పరిష్కరించేలా చూడాలన్నారు. ఎన్నికల నిబంధనలు డిసెంబర్‌ 5వ తేదీ వరకు అమల్లో ఉంటాయన్నారు. ఈ సందర్భంలో కంట్రోల్ రూం నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కార్యక్రమంలో కంట్రోల్ రూమ్ ఇన్​చార్జ్ గౌతమ్, రాము తదితరులు పాల్గొన్నారు.

ఎలక్షన్​ కోడ్​ పకడ్బందీగా అమలు

మంచిర్యాల : జిల్లాలో ఎలక్షన్​ కోడ్​ను పకడ్బందీగా అమలు చేస్తున్నామని మంచిర్యాల కలెక్టర్ బదావత్​సంతోష్​అన్నారు. అడిషనల్​కలెక్టర్లు సబావత్​మోతీలాల్, బి.రాహుల్, డీసీపీ సుధీర్ రాంనాథ్​ కేకన్​తో కలిసి మంగళవారం కలెక్టరేట్​లో మీడియాతో మాట్లాడారు. జిల్లాలో స్పెషల్​ టీమ్​లను ఏర్పాటు చేశామని, వాటిని జిల్లా యంత్రాంగం నిరంతరం పర్యవేక్షిస్తోందని తెలిపారు. అంతకుముందు సెక్టార్​అధికారులకు మాస్టర్ ​ట్రైనర్లతో శిక్షణ కార్యక్రమం​నిర్వహించారు.

అంతకుముందు స్వీప్ యాక్టివిటీస్​లో భాగంగా నస్పూర్​లో కళాజాత బృందంతో ఓటరు అవగాహన వాహనాన్ని డీఆర్డీవో శేషాద్రితో కలిసి జెండా ఊపి ప్రారంభించారు. ఓటు రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అని, ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా పారదర్శకంగా, నిర్భయంగా  వినియోగించుకోవాలని కోరారు.

ఓటు వేయలేని స్థితిలో ఉన్న వారి కోసం 12డీ ఫామ్

బెల్లంపల్లి : ఎన్నికల నియమావళి అమల్లో భాగంగా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు బెల్లంపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి, జిల్లా అడిషనల్ కలెక్టర్ బి.రాహుల్ తెలిపారు. బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఈ నెల 31 లోగా ఆయా  పోలింగ్ కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని కోరారు.

ఓటు వేయలేని వారు, నడవ లేని స్థితిలో ఉన్న వారు ఓటు హక్కును ఇంటి నుంచే వినియోగించుకునేలా కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని, అందుకు ఎన్నికల సిబ్బందికి 12డీ ఫారం ద్వారా దరఖాస్తులు చేసుకోవాలన్నారు.

ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

బెల్లంపల్లి రూరల్ : ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని డీసీపీ రాంనాథ్​ కేకన్ ​ప్రజలకు సూచించారు. మంగళవారం భీమిని మండలంలోని ఖర్జీభీంపూర్, కన్నెపల్లి మండలంలోని నాయకునిపేట గ్రామ పంచాయతీల్లోని పోలింగ్ ​స్టేషన్​లను ఆయన పరిశీలించారు. ప్రతి ఒక్కరు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు కృషి చేయాలని కోరారు.

ఖర్జీభీంపూర్​లోని పోశమ్మ గుడికి వెళ్లేదారి గుంతలమయంగా మారిందని డీసీపీ దృష్టికి గ్రామస్తులు తీసుకెళ్లగా రోడ్డుకు రిపేర్లు చేయించాలని ఎస్​ఐను ఆదేశించారు. ఆయన వెంట బెల్లంపల్లి ఏసీపీ సదయ్య, ఎస్సైలు ప్రశాంత్, నరేశ్ ఉన్నారు.