వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు : కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే
  •     కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే

ఆసిఫాబాద్, వెలుగు: వచ్చే వేసవిలో నీటి సమస్య తలెత్తకుండా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆసిఫాబాద్ కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే సూచించారు. వేసవిలో నిరంతర తాగునీటి సరఫరా కోసం చేపట్టాల్సిన చర్యలపై కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధాశుక్లాతో కలిసి మిషన్ భగీరథ, ఇంట్రా, గ్రిడ్ ఇంజినీరింగ్ అధికారులతో కలిసి మంగళవారం కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జల్ సేవ ఆంకలన్ పథకం కింద జిల్లాలోని 15 గ్రామ పంచాయతీలను ఎంపిక చేశామని, ఈ నెల 20న సర్పంచ్ అధ్యక్షతన గ్రామసభలు నిర్వహించి తాగునీటిపై చర్చించాలని సూచించారు. 

ఫిబ్రవరిలో ప్రతి తాగునీటి వనరును తనిఖీ చేసి, రానున్న వేసవిలో ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. పైప్​లైన్ల రిపేర్లు చేపట్టాలని, గ్రామాల్లోని ప్రతి ఇంటికి శుద్ధమైన తాగునీరు అందించేలా సర్పంచ్​ల సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈవో లక్ష్మీనారాయణ, డీపీవో బిక్షపతి, మిషన్ భగీరథ ఇంట్రా ఈఈ  ఇంజనీర్ సిద్ధిక్, గ్రిడ్ ఈఈ రాకేశ్, డీఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

నీటి వనరుల రక్షణకు చర్యలు

జిల్లాలో నీటి వనరులను రక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ అన్నారు. నీటి వనరుల రక్షణపై డీఎఫ్​వో నీరజ్ కుమార్​ టిబ్రేవాల్, అడిషనల్ కలెక్టర్ డేవిడ్, కాగజ్ నగర్ ఫారెస్ట్ డివిజన్ ఆపీసర్ అప్పయ్యతో కలిసి  అటవీ, నీటిపారుదల, రెవెన్యూ, మత్స్య, పర్యాటక శాఖల అధికారులతో   కలెక్టరేట్​లో రివ్యూ నిర్వహించారు. 

కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 150 చెరువులను చిత్తడినేల(వెట్ ల్యాండ్)గా గుర్తించామని, సంబంధిత శాఖల అధికారులు ఆయా చెరువులను సందర్శించి నివేదికలు రూపొందించి అందించాలని ఆదేశించారు. చెరువులు ధ్వంసం కాకుండా రక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. జిల్లాలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నీరు నిల్వ ఉండే శిఖం ప్రాంతాన్ని గుర్తించాలని సూచించారు.