ఏండ్లసంది అవే కష్టాలు

ఏండ్లసంది అవే కష్టాలు
  • వంతెనల నిర్మాణం పునాదులు దాటట్లే 
  • ఫుల్లుగా వర్షాలు పడితే ఇబ్బందే
  • ఏటా బాహ్యప్రపంచానికి దూరమవుతున్న గ్రామాలు

ఆసిఫాబాద్,వెలుగు: పాలకుల నిర్లక్ష్యం.. ఆఫీసర్ల అలసత్వం వల్ల ఆసిఫాబాద్ జిల్లాలో అడవి బిడ్డలు అరిగోసపడుతున్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఆదివాసీలు వణికిపోతున్నారు. ఎప్పుడు ఏ వరద ముంచెత్తుతుందో?  ఏ వాగు పొంగుతుందోనని భయపడుతున్నారు. ఏటా చిన్న వర్షాలకే వాగులు, వంకలు పొంగి ప్రవహించడంతో దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఊర్లకు ఊర్లు జలదిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. జనం బాహ్య ప్రపంచానికి దూరమవతున్నారు.

రవాణా సౌకర్యం అంతే..

రోడ్డు, రవాణా సౌకర్యం లేక ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. వాగులపై ఏళ్లకేళ్లుగా వంతెనలు నిర్మించకపోవడంతో ఊరుదాటి బయటకు వెళ్లడంలేదు.  వర్షాకాలంలో చాలా గ్రామాలకు రవాణా సౌకర్యం నిలిచిపోయి రోగులు, గర్భిణులు, బాలింతలు గడపదాటడంలేదు. సరుకుల కోసం జనం అల్లాడుతారు. 108కు ఫోన్​ చేయాలన్నా.. కనీసం సిగ్నల్స్ ఉండడంలేదు.

  • కెరమెరి మండలంలోని ఉమ్రి పెద్ద వాగుపై వంతెన ఏండ్లసంది కొనసాగుతూనే ఉంది. పనులు అసంపూర్తిగా ఉండడంతో వర్షాకాలంలో 12  గ్రామాల ప్రజలు మండల కేంద్రానికి రాలేకపోతున్నారు. అనార్ పెల్లి పెద్దవాగుపై నిర్మిస్తున్న వంతెన పనులు ఐదేళ్లుగా అసంపూర్తిగా ఉన్నాయి. లక్మాపూర్ పెద్దవాగుపై రూ. మూడు కోట్లతో నిర్మిస్తున్న వంతెన అర్ధంతరంగా నిలిచిపోయింది. 
  • బెజ్జూర్ మండలంలోని తీగల ఒర్రెపై బ్రిడ్జి నిర్మించాలని ఈప్రాంత ప్రజలు ఏళ్లసంది డిమాండ్ చేస్తున్నారు. పెంచికల్​పేట– బెజ్జూర్ ప్రధాన రహదారిపై ఉన్న  ఒర్రెపై లోలెవల్ వంతెనతో ఇబ్బంది పడుతున్నామని పేర్కొంటున్నారు. వరద వస్తే అటూ ఇటూ రవాణా స్తంభిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 
  • కౌటాల మండలంలోని  రణవెల్లి వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు పదేళ్లయినా పూర్తికాలేదు. దీంతో ఏటా వరద ఉధృతికి రాకపోకలు స్తంభిస్తున్నాయి. 
  • ఆసిఫాబాద్ మండలం గుండి పెద్దవాగు వంతెన పదిహేనేళ్లు దాటినా పిల్లర్ల దశ వీడలేదు. దీంతో ఏటా వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలు బాహ్య ప్రపంచానికి దూరమవుతున్నారు. గుండి గ్రామ ప్రజలు వాంకిడి మండలం మీదుగా 20 కిలో మీటర్ల దూరం ప్రయాణించి ఆసిఫాబాద్ చేరుకుంటున్నారు. 
  •  జైనూర్ మండలంలోని చితకర్రలోని వాగులో గత ఏడాది బ్రిడ్జి నిర్మాణ పనులు స్టార్ట్ చేశారు. ఇంత వరకు వంతెన పూర్తికాలేదు. ఇక్కడ వాగు దాటడానికి కిషన్ నాయక్ తండా, అడేశార గ్రామాల గిరిజనులు ఏటా వర్షాకాలంలో ఇబ్బంది పడుతున్నారు. 
  • చింతలమానేపల్లి మండలం బాబాసాగర్, నాయకపు గుడాలో వంతెన పనులు నిలిచిపోయాయి. ఫలితంగా వర్షాకాలంలో మండల కేంద్రానికి చేరుకోవడం కష్టంగా మారింది. ఆఫీసర్లు, లీడర్ల నిర్లక్ష్యం కారణంగా ప్రజలునరకయాతన పడుతున్నారు.


వానాకాలం వస్తే భయమే...

మాది చింతలమానేపల్లి మండలం దిందా. ఊరు ప్రారంభంలో ఉన్న వాగుపై లోలెవల్​వంతెన ఉంది. హై లెవెల్ బ్రిడ్జి కట్టాలని ఎన్నో ఏండ్లుగా కోరుతున్నాం. అయినా పట్టించుకుంటలేరు. వానాకాలం వస్తే చాలు బయటకు వెళ్లలేకపోతున్నాం. రెండేళ్ల క్రితం బ్రిడ్జి మంజూరు అయ్యిందని చెప్పారు. కానీ.. ఫారెస్ట్ క్లీయరెన్స్ లేక పనులు షురూ కాలేదంటున్నారు. 

-  వెంకటేశ్

దిందా'సరుకులు ఒకేసారి తెచ్చుకుంటం..

ఊరి వాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి ఆరేళ్లుగా అసంపూర్తిగా ఉంది. వర్షాకాలంలో మండల కేంద్రానికి వెళ్లాలన్నా.. దవాఖానకు పోవాలన్నా.. ఇబ్బంది పడుతున్నాం. విత్తనాలు, ఎరువులు, మూడు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులు ఒక్కటేసారి తెచ్చుకుంటాం. ఆఫీసర్లు, లీడర్లకు ఎన్నిసార్లు చెప్పినా లాభం లేకుండా పోయింది.

-  రాథోడ్ రవి, లక్మాపూర్, కెరమెరి