
కొడిమ్యాల,వెలుగు: జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం నాచుపల్లి గ్రామంలో వృద్ధురాలు ప్రేమలత మర్డర్ మిస్టరీ వీడింది. వరుసకు అల్లుడే హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి శుక్రవారం కేసు వివరాలను డీఎస్పీ రఘుచందర్, సీఐ రవి మీడియాకు వెల్లడించారు. కొడిమ్యాల ప్యాక్స్ చైర్మన్, కాంగ్రెస్ నాయకుడు మెన్నేని రాజ నర్సింగరావు తల్లి ప్రేమలత సొంతూరు నాచుపల్లి గ్రామంలో ఒంటరిగా నివసిస్తున్నారు.
వరసకు అల్లుడయిన సురభి రఘునందన్‌తో గతంలో గొడవలు ఉండేవి. అప్పట్లో పెద్దమనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి రఘునందన్ తో ప్రేమలతకు క్షమాపణ చెప్పించారు. దీన్ని మనసులో పెట్టుకున్న రఘునందన్ సమయం కోసం వేచిచూస్తున్నాడు. ఈ క్రమంలో ప్రేమలత బుధవారం జగిత్యాల నుంచి బస్సులో వచ్చి రాత్రి నాచుపల్లిలో దిగి నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది.
అదే టైంలో రఘునందన్‌రావు కూడా తన పౌల్ట్రీ ఫాం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాడు. పాత పగలు మనసులో పెట్టుకొని ఇదే అదునుగా భావించిన అతను.. పక్కనే ఉన్న కర్రతో, బండరాయితో ఆమెపై దాడి చేశాడు. ఆ టైంలో ఆమె స్థానిక ఆటో డ్రైవర్‌కు ఫోన్ చేసి తనను రఘునందన్ చంపుతున్నాడని చెప్పింది. అనంతరం తలపై కొట్టిన అతను.. ప్రేమలత చనిపోయిందని భావించి రోడ్డుపై నుంచి ఈడ్చుకుంటూ ఇంటి సమీపంలోని బావిలో పడేశాడు. ఫోన్ కాల్ ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు.
రఘునందన్ రావే హత్య చేసినట్లు నిర్ధారించుకున్న పోలీసులు అతని కోసం వెతికడం ప్రారంభించారు. శుక్రవారం ఉదయం దొంగలమర్రి రైల్వే బ్రిడ్జి సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. మృతురాలి కోడలు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. 24 గంటల్లోనే కేసును ఛేదించిన డీఎస్పీ, సీఐలను
ఎస్పీ అభినందించారు.
ప్రముఖుల పరామర్శ
మెన్నేని రాజనర్సింగరావు తల్లి హత్యకు గురికాగా ఆయనను శుక్రవారం పలువురు ప్రముఖులు పరామర్శించారు. హత్య వివరాలను అడిగి తెలుసుకొని సానుభూతి ప్రకటించారు. చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మైత్రి గ్రూప్స్ అధినేత కొత్త జైపాల్ రెడ్డి పరామర్శించారు. వారితోపాటు లీడర్లు కమలాకర్ రెడ్డి, చందు, ముత్యం శంకర్, గాజుల అజయ్ గౌడ్, అజయ్ రెడ్డి, తదితరులు ఉన్నారు.