అసెంబ్లీ డేస్​ తగ్గిపోతున్నయ్

అసెంబ్లీ డేస్​ తగ్గిపోతున్నయ్

గడిచిన ఆరేండ్లలో 153 రోజులే భేటీ

రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాలు 126 రోజులే

ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 200 రోజులు నడిచేవి

ప్రభుత్వం చెప్పేదొకటి.. చేసేదొకటి: ప్రతిపక్షాలు

హైదరాబాద్, వెలుగుఎన్నిరోజులైనా అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని ప్రభుత్వం చెప్తున్నా.. ఏ సెషన్​లో కూడా అలా జరగడం లేదు. ఒక్కోసారి సెషన్స్​ను నాలుగైదు రోజులకే పరిమితం చేస్తున్నారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో సెషన్స్​ ఎక్కువగా ఉండేవని, అవి కూడా ఎక్కువ రోజులు జరిగేవని గుర్తు చేస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ కాలపరిమితి ముగిసేలోపు కనీసం 200 రోజులు సమావేశాలు జరిగేవి.

ఏటా బడ్జెట్, వర్షకాల, శీతాకాల సెషన్స్ ఉండేవి. ఒక్కో సెషన్​ కనీసం 20 నుంచి 30 రోజులపాటు నడిచేది. అప్పుడప్పుడు ప్రత్యేక సెషన్స్​ ఉండేవి. కానీ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆ సంప్రదాయం కనిపించడం లేదు. సెషన్స్​ తగ్గిపోయాయి. వాటి సమావేశాల రోజులూ తగ్గిపోయాయి. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు ఆరేండ్లలో కేవలం 153 రోజులే సభ జరిగింది.

చెప్పేదొకటి.. జరిగేదొకటి

ప్రతి అసెంబ్లీ సెషన్ స్టార్టవడానికి ముందు సీఎం కేసీఆర్.. ‘ఎన్ని రోజులైనా సభా పెట్టేందుకు సర్కారు రెడీగా ఉంది. ప్రతి అంశంపై చర్చకు సిద్ధం’ అంటారు. దీంతో అపోజిషన్ సభ్యులు పలు అంశాలపై బిజినెస్ అడ్వయిజర్‌‌ కమిటీ(బీఏసీ) మీటింగ్‌‌కు ఎజెండా ఇస్తారు. 20 రోజులు సభ పెట్టాలంటారు. కానీ తర్వాత జరిగేది వేరుగా ఉంటుంది. ముందుగా అనుకున్న ప్రకారం ఎన్ని రోజులు సభ జరగాలో ప్రభుత్వం తరఫున బీఏసీలో ఉండే మంత్రులు చెప్తారని, దాన్నే ఆమోదిస్తుంటారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఉమ్మడి రాష్ట్రంలో మస్తు రోజులు

సొంత రాష్ట్రంలో కన్నా ఉమ్మడి రాష్ట్రంలోనే అసెంబ్లీ ఎక్కువ రోజులు సమావేశమైంది. ఉమ్మడి రాష్ట్రంలో చివరి అసెంబ్లీ (2009-2014) 201 రోజులు భేటీ అయింది. అయితే.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు 153 రోజులే సభ జరిగింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి అసెంబ్లీ (2014–18) 126 రోజులు మాత్రమే జరిగింది. 2014 జూన్​లో ఆరు రోజులు, నవంబర్​లో 19 రోజులు సమావేశాలు జరుగగా.. 2015 మార్చిలో 14 రోజులు, సెప్టెంబర్​లో 7 రోజులు జరిగాయి. 2016 మార్చిలో 17 రోజులు, ఆగస్టులో ఒకరోజు, 2016 డిసెంబర్  నుంచి 2017 జనవరి మధ్య 18 రోజులు జరిగాయి. 2017 మార్చిలో 13 రోజులు, ఏప్రిల్​ 16న ఒకరోజు, ఏప్రిల్​ 30న ఒకరోజు, అక్టోబర్​లో 16 రోజులే అసెంబ్లీ భేటీ అయింది. 2018లో 13 రోజులే జరిగింది. రెండో అసెంబ్లీ అమలులోకి వచ్చి 19 నెలలు అవుతున్నా.. ఇప్పటికి 27 రోజులే సమావేశాలు జరిగాయి. ఈ నెల 7 నుంచి అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇది ఎన్నిరోజులు నిర్వహిస్తారన్నది బీఏసీ భేటీలో నిర్ణయించి ప్రకటిస్తారు.

బడ్జెట్ సెషన్  9 రోజులకు పరిమితం

పద్దులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చకు 20 రోజులు సభ సమావేశం కావాలనే రూల్‌‌ ఉంది. ప్రతి మెంబర్‌‌కు పద్దులపై చర్చకు అవకాశం ఇవ్వాలని ఉమ్మడి రాష్ట్రంలో స్టాండింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. కానీ రాష్ట్రం ఏర్పాటయ్యాక స్టాండింగ్ కమిటీలను పక్కన పెట్టారు. బడ్జెట్‌‌తో పాటు పద్దుల చర్చను 9 రోజులకు పరిమితం చేశారు. అసెంబ్లీ టైంలో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని అలర్ట్ చేసేందుకు ప్రతిపక్షాలకు వాయిదా తీర్మానం అస్త్రంగా ఉంటుంది. సభ స్టార్టవగానే తీర్మానం ఇచ్చి ఆ అంశంపై చర్చకు పట్టుబట్టేవారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రతి రోజు సభ స్టార్టవగానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం వాయిదా తీర్మానంతో అందరి దృష్టిని టీఆర్ఎస్ ఆకర్షించేది. ఇప్పుడేమో రూల్స్ కమిటీ వేసి వాయిదా తీర్మానం ప్రశ్నోత్తరాల తర్వాత నిర్ణయించారు. దీనిపై కాంగ్రెస్ మొదట్నించీ అభ్యంతరం తెలుపుతోంది.

మాట్లాడేందుకు చాన్స్​ ఏది?: ప్రతిపక్షాలు

అసెంబ్లీలో అన్నివర్గాల  ప్రజల సమస్యలపై విస్తృతంగా చర్చ జరగాలి. ప్రతిపక్షాలు ఇచ్చే  సూచనలు, సలహాలు తీసుకోవాలి. కానీ రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటి వరకు అసెంబ్లీలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తోందని, తమకు మాట్లాడేందుకు సమయం ఇవ్వడం లేదని, తమ గొంతు నొక్కేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రం ఏర్పడ్డాక ఫస్ట్‌‌, సెకండ్‌‌ అసెంబ్లీ సమావేశాలు 744 గంటలు జరిగాయి. అందులో మెజార్టీ టైమ్‌‌ కేసీఆరే మాట్లాడారని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ఏడాదికి 60 రోజులు సభ అన్నరు

ఏటా 60 రోజులు సభ పెడ్తామని తొలి అసెంబ్లీ బీఏసీలో కేసీఆర్ హామీచ్చారు. ప్రతి బీఏసీలో ఆ విషయాన్నే నేను గుర్తు చేస్తుంటాను. ఆయన కూడా అలాగే అంటారు. తర్వాత ఏం జరుగుతదో అందరికీ తెలుసు. ప్రభుత్వ ఎజెండా పూర్తవగానే సభను నిరవధికంగా వాయిదా వేస్తున్నారు. ప్రతిపక్ష సభ్యులకు సరైన టైమ్‌‌ ఇవ్వరు. మాట్లాడం పూర్తి కాకముందే మైక్ కట్‌‌ చేస్తరు. ఎదురుదాడి చేస్తరు. అసెంబ్లీని ఇష్టానుసారంగా నడిపించుకుంటున్నరు.– భట్టి విక్రమార్క, కాంగ్రెస్ పక్ష నేత