పెద్దపల్లి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మరో వారం రోజుల్లో మూడుముళ్ల బంధంతో ఒక్కటి కావాల్సిన ప్రేమ జంట గోదావరి నదిలో కొట్టుకుపోయింది. యువకుడిని జాలర్లు కాపాడగా.. పుష్కరఘాట్ లో మునిగి యువతి చనిపోయింది. యువతి మృతితో యువకుడు, ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
పెద్దపల్లి జిల్లాలో గోదావరి ఖని స్థానిక విఠల్ నగర్ కు చెందిన యువకుడికి ఇన్ స్టాగ్రమ్ లో పెద్దపల్లికి చెందిన ఓ యువతితో పరిచయం ఏర్పడింది. రెండు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. ఇరు కుటుంబాలు కూడా వీళ్ల పెళ్లికి ఒప్పుకున్నారు.నవంబర్ 1న పెళ్లి నిశ్చయించుకున్నారు.
ఈ క్రమంలో యువతీయవకుడు తన కుటుంబ సభ్యులతో కలిసి గోదావరిఖని సమ్మక్క సారాలమ్మ పుష్కర ఘాట్ దగ్గర గోదావరి పుణ్యస్నానాలకు వచ్చారు. నదిలోకి దిగి స్నానం చేస్తున్న క్రమంలో ప్రేమ జంట నదిలో కొట్టుకు పోయారు. ఈ విషయం గమనించిన జాలర్లు యువకుడిని కాపాడారు. యువతి నీట మునిగి మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు రోదిస్తున్నారు. యువతి మృతదేహాన్ని గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి వచ్చిన టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
