తెలంగాణలో సీఎం అభ్యర్థులు వీరేనా..? 

తెలంగాణలో సీఎం అభ్యర్థులు వీరేనా..? 

తెలంగాణ రాష్ట్రంలో  ముచ్చటగా మూడోసారి అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈసారి ఎన్నికలు మాత్రం చాలా చాలా ప్రత్యేకం. పార్టీలకే కాదు, ప్రజలకు కూడా! ఎన్నికలకు మరో పక్షం రోజులు కూడా లేవు. ఇప్పటికీ ఓటరు నిగూఢంగానే ఉండటం, సర్వేలు తలో రీతిగా నివేదికలు ఇవ్వడంతో ఉత్కంఠను తీవ్రస్థాయికి తీసుకెళ్లాయి. ఇవన్నీ పక్కన పెడితే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల నుంచి ముగ్గురు కీలక నేతలు రెండేసి నియోజకవర్గాలలో పోటీ చేస్తున్నారు.

పాలకపక్షం బీఆర్‌‌ఎస్‌‌ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ తన సిట్టింగ్‌‌ స్థానం గజ్వేల్‌‌తో పాటు కామారెడ్డి నియోజకవర్గంలోనూ ఈసారి పోటీ చేస్తున్నారు. మరోవైపు బీజేపీకి చెందిన ప్రధాన నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్‌‌  తన సొంత నియోజకవర్గంహుజూరాబాద్‌‌తో పాటు గజ్వేల్ బరిలో దిగికేసీఆర్‌‌కు సవాల్‌‌ విసురుతున్నారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌‌రెడ్డి తనకు పట్టున్న కొడంగల్‌‌ నియోజకవర్గంతో పాటుగా కామారెడ్డిలో  కేసీఆర్‌‌కు ఎదురొడ్డి పోరాడుతున్నారు. 

కాంగ్రెస్​ గెలిస్తే సీఎం పాలమూరు బిడ్డేనా?

అసలు కామారెడ్డి నుంచి పోటీ చేయడానికి రేవంత్‌‌కు అధిష్టానం గ్రీన్‌‌ సిగ్నల్‌‌ ఇచ్చిందంటేనే ఢిల్లీ పెద్దల మనసులో ఏముందో మనకు అర్థమవుతోంది. రేవంతే  ముఖ్యమంత్రి అభ్యర్థి అని    అధినాయకత్వం  పరోక్షంగా సంకేతాలు పంపించిందని భావించవచ్చు. మరోవైపు 'బూర్గుల రామకృష్ణారావుకు వచ్చిన అవకాశం మీ కొడంగల్‌‌ బిడ్డకు రానుంది. ఈసారి గెలిపించి ఆశీర్వదించండి' అంటూ కొడంగల్‌‌ సభలో  రేవంత్‌‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఇన్‌‌డైరెక్ట్​గా తానే సీఎం అభ్యర్థినని చెప్పకనే చెప్పాయి.

షాద్‌‌నగర్‌‌కు చెందిన బూర్గుల హైదరాబాద్‌‌ స్టేట్‌‌కు ముఖ్యమంత్రిగా పని చేసిన విషయం తెలిసిందే! ఆ తర్వాత ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌కు చెందిన వారెవ్వరికీ ఆ స్థాయి అవకాశం దక్కలేదు. బూర్గుల పేరును ప్రస్తావించడం ద్వారా రేవంత్‌‌రెడ్డి మరింత సంకేతం ఇచ్చినట్టయ్యింది. కాంగ్రెస్‌‌లో నిన్నమొన్నటి వరకు తాము కూడా ముఖ్యమంత్రి రేసులో ఉన్నామని చెప్పుకున్న  నాయకులకు కూడా  ఈ విషయం అర్థమైందని అనుకోవచ్చు. ఇప్పుడెవరూ అలా చెప్పుకునే సాహసం చేయడం లేదు. అధిష్టానం ఆదేశిస్తే.. అని పరోక్షంగా తమ ఆకాంక్షను చెప్పుకుంటున్నారే తప్ప, కాంగ్రెస్‌‌ గెలిస్తే ముఖ్యమంత్రి అవుతామని అనడం లేదు. 

కాంగ్రెస్​, బీజేపీలు సీఎంపై పోటీఇక భారతీయ జనతాపార్టీ విషయానికి వస్తే తెలంగాణలో తాము అధికారంలోకి వచ్చి తీరతామనే విశ్వాసంతో ఆ పార్టీ ఉంది. తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని బీజేపీ ప్రకటించింది. ఎప్పుడైతే ఈ ప్రకటన వచ్చిందో అప్పట్నుంచి ఈటల రాజేందర్‌‌, బండి సంజయ్​పై ఫోకస్‌‌ ఎక్కువయ్యింది. తనను ముఖ్యమంత్రి అభ్యర్థిగా సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీనే చెప్పారని ఈటల రాజేందర్‌‌ ఆమధ్య ఇంగ్లీష్‌‌ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. ఇక్కడ గమనించదగ్గ విషయమేమిటంటే ఈటల రాజేందర్‌‌ కూడా గజ్వేల్‌‌లో కేసీఆర్‌‌తో పోటీపడటం! ఇపుడు కొడంగల్​, గజ్వేల్​,కామారెడ్డి, కరీంనగర్​ స్థానాలు సీఎం అభ్యర్థుల స్థానాలుగా మారాయి అంటే తప్పుకాదేమో?

జాతీయ పార్టీలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరో ఎప్పుడూ ముందుగా ప్రకటించవు. విజయం సాధించిన తర్వాత  మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారం ముందుకు వెళతాయి. నాయకత్వ సమస్య ఎక్కువగా ఉన్న చోట్ల అసలు సీఎం అభ్యర్థులను ప్రకటించే సాహసం చేయవు. కాకపోతే కాంగ్రెస్‌‌ కానీ, బీజేపీ కానీ పరోక్షంగా కొన్ని సంకేతాలు ఇచ్చాయి. వాటికి అనుగుణంగానే పార్టీ నేతలు నడుచుకోవాలనే అర్థం అందులో ఉంది. కాంగ్రెస్​, బీజేపీలు   కేసీఆర్‌‌ పై పోటీ చేయడంతో ఆయనకు  ధీటైన పార్టీలు మేమే అని చెప్పకనే చెప్పుకుంటున్నాయి.  

ముఖ్యమంత్రి కేసీఆర్‌‌ను కామారెడ్డిలో రేవంత్‌‌రెడ్డి ఓడిస్తే మాత్రం అది కొత్త చరిత్రే అవుతుంది. గజ్వేల్‌‌లో ఈటల గెలిచినా అంతే! కేసీఆర్‌‌కు ప్రత్యామ్నాయ నాయకుడిగా  గుర్తింపు పొందిన రేవంత్‌‌రెడ్డి, ఈటల రాజేందర్‌‌ లకు, అటు కాంగ్రెస్‌‌, ఇటు బీజేపీ అధినాయకత్వాలు అవకాశం ఇచ్చాయంటే ఇద్దరినీ ప్రోత్సహిస్తున్నట్టుగా అర్థమవుతోంది. సీఎం అభ్యర్థులిద్దరూ ముఖాముఖి తలపడటమన్నది దేశంలో ఒకట్రెండు చోట్ల తప్ప ఎక్కడా జరగలేదు. తెలంగాణలో ఆ అరుదైన ఘటన జరుగుతోంది.

రేవంత్​ను ప్రజలు సీఎం అభ్యర్థే అనుకుంటున్నారు

తమది జాతీయపార్టీ అని ఎంతగా చెప్పుకుంటున్నా బీఆర్‌‌ఎస్‌‌ను ప్రాంతీయపార్టీగానే చూడాలి. ప్రాంతీయపార్టీలలో అధినేతే ఉన్నత పదవిలో ఉంటారు. జాతీయపార్టీలలో అలా కాదు, వాటికంటూ ఓ విధానం ఉంటుంది.  ఎన్నికల ముందు ముఖ్యమంత్రి అభ్యర్థులను ప్రకటించడమన్నది జాతీయపార్టీలలో చాలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి ఎవరవుతారన్నది ప్రజల ఊహకే వదిలేస్తాయి.

ఇప్పుడు తెలంగాణ సినేరియో చూస్తే మాత్రం కాంగ్రెస్‌‌ నుంచి రేవంత్‌‌రెడ్డినే ముఖ్యమంత్రి అభ్యర్థి అనే వాతావరణం నెలకొంది . సీఎం కేసీఆర్‌‌లాగే రెండు స్థానాల నుంచి పోటీ చేస్తున్నారని కాదుకానీ కేసీఆర్‌‌కు ప్రత్యర్థిగా బరిలో దిగారంటేనే ఆయనే సీఎం క్యాండిడేట్‌‌ అని అర్థమవుతోంది.  ప్రజలు కూడా ఆ భావనతోనే ఉన్నారు. కాంగ్రెస్‌‌ విజయం సాధిస్తే ముఖ్యమంత్రి పదవిలో రేవంత్‌‌రెడ్డే ఉంటారనే నిర్ణయానికి వచ్చేశారు. ఆయన పాల్గొంటున్న సభలలో, రోడ్‌‌ షోలలో ప్రజలు అలాగే నినదిస్తున్నారు కూడా!

- బోదనపల్లి వేణుగోపాల్‌‌రెడ్డి, అధ్యక్షుడు, తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక