ఎన్నికల’కు రోడ్లు!.. ఏండ్లుగా పెండింగ్​పెట్టిన ప్రతిపాదనలకు మోక్షం

ఎన్నికల’కు రోడ్లు!.. ఏండ్లుగా పెండింగ్​పెట్టిన ప్రతిపాదనలకు మోక్షం
  • రూ.వందల కోట్లు మంజూరు చేస్తూ వరుస జీఓలు
  • నిధుల వరద అంటూ బీఆర్ఎస్​సోషల్ మీడియాలో ప్రచారం
  • కోడ్​రాక ముందే శంకుస్థాపనకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు

ఖమ్మం, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడడంతో ఖమ్మం జిల్లాలోని రోడ్లకు నిధుల వరద కొనసాగుతోంది. ఏండ్లుగా పెండింగ్​పెట్టిన ప్రతిపాదనలకు మోక్షం లభిస్తోంది. లింక్ రోడ్లు, వాగులపై చెక్ డ్యామ్ లు, హైలెవల్ బ్రిడ్జిలు, సింగిల్ గా  ఉన్నచోట డబుల్ రోడ్డుగా విస్తరణ, డొంక రోడ్లను బీటీగా మార్చడం వంటి పనులకు రాష్ట్ర ప్రభుత్వం రూ.వందల కోట్లు మంజూరు చేస్తోంది. నాలుగు నెలల్లో ఎన్నికలు ఉండడంతో కోడ్​రాకముందే శంకుస్థాపనలు చేసేందుకు ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. 

ఎన్నికల ప్రచారానికి వెళ్తే జనం నిలదీయకుండా అవసరమైన అన్ని పనులు మంజూరు చేయిస్తున్నారు. ఇప్పటివరకు ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్​శాఖల నుంచి దాదాపు రూ.వెయ్యి కోట్లకుపైగా నిధులు కేటాయిస్తూ జీఓలు జారీ అయ్యాయి. దీంతో ఆయా నియోజకవర్గాల్లో అధికార పార్టీకి చెందిన లీడర్లు సోషల్ మీడియాలో నిధుల వరద అంటూ ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. అదే టైంలో ఎన్నికల స్టంట్లు అంటూ ప్రతిపక్ష పార్టీల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాలుగేండ్లుగా ఏమీ చేయకుండా ఎన్నికల ముందు శంకుస్థాపనలు చేసేందుకే జీఓలు రిలీజ్ చేస్తున్నారంటూ కామెంట్లు చేస్తున్నారు. 

పాలేరుకు రూ.124 కోట్లు

రెండు వారాల వ్యవధిలో పాలేరు నియోజకవర్గంలో దాదాపు రూ.124 కోట్ల విలువైన పనులకు సంబంధించిన జీఓలు విడుదలయ్యాయి. ఖమ్మం రూరల్ మండలంలోని పల్లెగూడెం నుంచి మంగళగూడెం వరకు ఉన్న రోడ్డును డబుల్​చేయాలని ఎన్నో ఏండ్లుగా స్థానికులు డిమాండ్​చేస్తుండగా ఎట్టకేలకు మోక్షం కలిగింది. ఇక్కడ గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీలు ఉండడంతో భారీ వెహికల్స్​రాకపోకలు పెరిగాయి. సింగిల్​రోడ్డు నిత్యం రద్దీగా ఉంటోంది. 

ఆకేరుపై ఉన్న లోలెవల్​బ్రిడ్జిపై మహాశివరాత్రి జాతర సందర్భంగా తీర్థాలకు తరలివచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వానా కాలంలో లోలెవల్​బ్రిడ్జిపై నుంచి రాకపోకలు నిలిచిపోతున్నాయి. ఈ రోడ్డును డబుల్ చేయాలని ఎప్పటి నుంచి డిమాండ్​ఉంది. ఆకేరుపై హైలెవల్​బ్రిడ్జి కమ్ చెక్ డ్యామ్, డబుల్ రోడ్డు కోసం ఇటీవల రూ.55 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. తాజాగా కూసుమంచి, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి మండలాల్లో 8 రోడ్లకు రూ.14 కోట్లు మంజూరయ్యాయి. గత వారం ఆరు చెక్ డ్యామ్​ల నిర్మాణానికి రూ.32.45 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ జారీ చేసింది. 

రూ.150 కోట్లతో రిటైనింగ్​వాల్స్

జిల్లాకు ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీని మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. తాత్కాలికంగా రూరల్ మండలంలో మహ్మదీయ కాలేజీలో ఇంజనీరింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తుండగా, ఈ విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభం కానున్నాయి. రఘునాథపాలెం మండలంలో ఆరు డొంక రోడ్లను బీటీ రోడ్లుగా మార్చేందుకు రూ.13.65కోట్లు మంజూరయ్యాయి. మున్నేరుకు రెండు వైపులా రూ.150 కోట్లతో ఆర్సీసీ రీటెయినింగ్ వాల్ నిర్మాణానికి కేబినెట్​గ్రీన్​ సిగ్నల్​ఇచ్చింది. మున్నేరుపై కాల్వొడ్డులో ఉన్న వందేళ్ల నాటి బ్రిడ్జిని ఆనుకొని తీగల వంతెన నిర్మాణానికి రూ.180 కోట్లు మంజూరు కాగా ప్రస్తుతం టెండర్ల దశలో ఉంది. ఇక సత్తుపల్లి నియోజకవర్గంలో ఎనిమిది నెలల్లోనే రూ.100 కోట్లకు పైగా ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించినట్టుగా ఎమ్మెల్యే అనుచరులు చెబుతున్నారు. మధిర, వైరా నియోజకవర్గాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. ప్రభుత్వాన్ని ఒప్పించి రూ.వందల కోట్ల ఫండ్స్ తెప్పిస్తున్నామని అధికార పార్టీ ప్రజా ప్రతినిధులు ప్రచారం చేస్తున్నారు. 

ఎలక్షన్​కోడ్ సాకుగా తప్పించుకుంటరు

ప్రజలను మభ్య పెట్టేందుకే పాలేరులో కాలేజీలు ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రకటించింది. ఓట్ల కోసమే పంచాయతీ రాజ్ రోడ్లకు నిధులు కేటాయిస్తున్నట్లు ఎమ్మెల్యేలు ప్రచారం చేసుకుంటున్నారు. ఇన్నేండ్లుగా గుర్తుకురాని పనులు, ఎన్నికలు దగ్గరపడ్డాక గుర్తుకొస్తున్నాయా? పనులన్నీ జీఓలకే పరిమితం అవుతాయి. రెండు నెలల్లో ఎన్నికల వస్తాయి. అధికార పార్టీ లీడర్లు కోడ్​ను సాకుగా చూపి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు.                                     

రాంరెడ్డి చరణ్ రెడ్డి, యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు