మేఘాలయ, నాగాలాండ్లో మొదలైన పోలింగ్

మేఘాలయ, నాగాలాండ్లో మొదలైన పోలింగ్

ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, నాగాలాండ్​లలో అసెంబ్లీ పోల్స్ ​ప్రారంభం అయ్యాయి.  చెరో 59 స్థానాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతోంది.  ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఇక త్రిపుర పోలింగ్​ ఫిబ్రవరి 16 తేదీన పూర్తయింది. ఈ మూడు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను ఎలక్షన్ కమిషన్​ మార్చి 2న వెల్లడించనుంది. మేఘాలయ, నాగాలాండ్​లలోని 118 అసెంబ్లీ స్థానాల్లో వివిధ పార్టీల నుంచి మొత్తం 552 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు.  

మేఘాలయ-బంగ్లా బార్డర్​ బంద్​ 

మేఘాలయలో 119 కంపెనీల కేంద్ర సాయుధ బలగాలను ఎలక్షన్​ కమిషన్​ మోహరించింది. 900 పోలింగ్​స్టేషన్లను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించింది. మార్చి 2న ఫలితాలు విడుదలయ్యే వరకు మేఘాలయ– బంగ్లాదేశ్​ బార్డర్​ ను మూసేయాలని ఈసీ ఆదేశించింది. గత ఎన్నికల సమయంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకున్న ఈస్ట్​ ఖాసీ హిల్స్​ జిల్లాలోని బార్డర్​ ఏరియాల్లో అధికార యంత్రాంగం సీఆర్పీసీ 144 సెక్షన్​ను విధించింది.  గత 48 గంటల  వ్యవధిలో మేఘాలయ– బంగ్లాదేశ్ బార్డర్​లో నిర్వహించిన వేర్వేరు తనిఖీల్లో  రూ.21.12 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. 

సంగ్మా వర్సెస్​ సంగ్మా..

మేఘాలయ పోల్స్​లో 4 పార్టీల మధ్య రసవత్తర పోటీ నెలకొంది. నేషనల్ పీపుల్స్​ పార్టీ(ఎన్పీపీ), బీజేపీ, కాంగ్రెస్, టీఎంసీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. పీఏ సంగ్మా కుమారుడు కాన్రడ్​ సంగ్మా నేతృత్వంలోని  ఎన్పీపీ 2018 అసెంబ్లీ పోల్స్​లో 19 స్థానాలు గెలిచింది. అనంతరం 2 సీట్లు గెలిచిన బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. 21 సీట్లు గెలిచిన కాంగ్రెస్ ప్రతిపక్షానికి పరిమితమైంది. మరో పార్టీ యునైటెడ్​ డెమొక్రటిక్​ పార్టీ(యూడీపీ) 6 సీట్లు గెలుచుకుంది. అయితే ఈసారి కూడా బీజేపీ, కాంగ్రెస్​ మొత్తం 59 (60) సీట్లలో ఒంటరిగా బరిలోకి దిగగా.. ఎన్పీపీ 57, టీఎంసీ 58, యూడీపీ 46  చోట్లలో అభ్యర్థులను నిలిపాయి.   ఎన్నికల ప్రచారంలో ఇతర ప్రతిపక్ష పార్టీలతో పాటు బీజేపీ కూడా ఎన్పీపీ ప్రభుత్వ  వైఫల్యాలను జనాల్లోకి తీసుకెళ్లింది.

నాగాలాండ్​లో ఆ  నలుగురు..

నాగాలాండ్​ చరిత్రలో ఇప్పటివరకు ఒక్క మహిళ కూడా అసెంబ్లీకి ఎన్నిక కాలేదు. ఈసారి పోటీచేస్తున్న మొత్తం 183 మంది అభ్యర్థుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. తొలిసారి అసెంబ్లీకి ఎన్నికై కొత్త చరిత్రను లిఖించేందుకు వారు ప్రచారంలో సర్వశక్తులు ఒడ్డారు. దీమాపూర్–3 సీటు నుంచి నేషనల్​ డెమొక్రటిక్​ ప్రోగ్రెసివ్​ పార్టీ (ఎన్డీపీపీ) అభ్యర్ధిగా  హెఖానీ జఖాలు, టెనింగ్​ సీటు నుంచి రోసీ థాంప్సన్​ (కాంగ్రెస్) పోటీ చేస్తున్నారు.  వెస్టెర్న్​ అంగామీ సీటు నుంచి సల్హౌతౌనౌ (ఎన్డీపీపీ),  అటాయ్జు సీటు  నుంచి కహౌలీ సెమా (బీజేపీ)  బరిలో ఉన్నారు.