అసెంబ్లీ ప్లాస్టిక్​ ఫ్రీ జోన్​

అసెంబ్లీ ప్లాస్టిక్​ ఫ్రీ జోన్​

హైదరాబాద్​, వెలుగు: అసెంబ్లీని ప్లాస్టిక్​ ఫ్రీ జోన్​గా మారుస్తామని స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ప్రకటించారు. అసెంబ్లీ ఆవరణలో ఇకపై ప్లాస్టిక్​తో తయారైన వస్తువులేవీ వాడబోమని తేల్చి చెప్పారు. పర్యావరణం, వన్యప్రాణుల సంరక్షణపై ఏర్పాటు చేసిన అసెంబ్లీ కమిటీ సోమవారం అసెంబ్లీ కమిటీ హాల్​లో తొలిసారి సమావేశమైంది. హరిత తెలంగాణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని స్పీకర్​ సూచించారు. మనిషి బతికేందుకు స్వచ్ఛమైన గాలి, ఫ్లోరైడ్​ లేని నీళ్లు, మంచి ఆహారం అవసరమన్నారు. హరితహారం, మిషన్​ భగీరథ, కాళేశ్వరం ప్రాజెక్టుల ద్వారా ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. అడవుల పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై పీసీసీఎఫ్​, ఫారెస్ట్​ అధికారులు పవర్​ పాయింట్​ ప్రజెంటేషన్​ ఇచ్చారు. స్పీకర్​, సభ్యులు అడిగిన డౌట్లను తీర్చారు.

అక్కడ వర్షాలెందుకు పడలేదు?

ఈ ఏడాది వర్షాలు బాగానే పడినా, మంజీరా నది పరీవాహక ప్రాంతంలో సరిగా కురవలేదని, దానికి గల కారణాలను విశ్లేషించాలని అధికారులను స్పీకర్​ పోచారం శ్రీనివాస్​రెడ్డి ఆదేశించారు. రిజర్వ్​ ఫారెస్ట్​లో కంపా నిధులతో  నీటి కుంటలు పెద్ద సంఖ్యలో తవ్వాలని సూచించారు. నాటిన మొక్కల్లో ఎక్కువ శాతం బతికేలా చర్యలు తీసుకోవాలన్నారు. ములుగు రిజర్వ్​ ఫారెస్టులాగే రాష్ట్రం మొత్తం అటవీ పునరుజ్జీవ చర్యలు చేపట్టాలని, పోచారం రిజర్వ్​ ఫారెస్టులో పచ్చదనాన్ని మరింతగా పెంచాలని సభ్యులు సూచించారు. పరిశ్రమలున్న ప్రాంతాల్లో వాటర్​ ట్రీట్​మెంట్​ ప్లాంట్ల ఏర్పాటు చేయాలన్నారు. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతంలో జింకలు, నెమళ్ల సంఖ్య బాగా పెరిగిందని, వాటి వల్ల పంటకు నష్టం కలుగుతోందని, వాటి తరలింపుపై దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు.