- పేపర్ కటింగ్స్, వీడియో రికార్డులు చట్టం ముందు నిలబడవు
- అనర్హత పిటిషన్లపై స్పీకర్ వివరణ.. 53 పేజీలతో గెజిట్ విడుదల
- నేడు సుప్రీం కోర్టుకు తీర్పు కాపీలు
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్కు చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారారనేందుకు పిటిషనర్లు బలమైన ఆధారాలు చూపలేదని.. పేపర్ కటింగులు, వీడియో రికార్డులు చట్టం ముందు నిలబడవని అసెంబ్లీ ట్రిబ్యునల్చైర్మన్ హోదాలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లారిటీ ఇచ్చారు. ఐదుగురు ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ బుధవారం ఆయన తీర్పునివ్వగా, దీనికి సంబంధించిన 53 పేజీల గెజిట్ ను గురువారం అసెంబ్లీ ట్రిబ్యునల్ విడుదల చేసింది. అందులో వివరాల మేరకు ఐదుగురు ఎమ్మెల్యేలు.. గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి, ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావ్, అరికెపూడి గాంధీపై అనర్హత పిటిషన్లు దాఖలయ్యాయి.
అయితే రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ పేరా 2 (1) (ఎ) కింద ప్రతివాదులు అనర్హతకు గురయ్యారని నిర్థారించడానికి ఎలాంటి ఆధారాలు ఈ ట్రిబ్యునల్ కు కనిపించలేదని ఆ గెజిట్ లో స్పీకర్ పేర్కొన్నారు. దీంతో ఐదు అనర్హత పిటిషన్లను ట్రిబ్యునల్ కొట్టివేసినట్టు స్పష్టం చేశారు. ఒక్కో ఎమ్మెల్యేపై దాఖలైన అనర్హత పిటిషన్ ను ఎందుకు కొట్టివేయాల్సి వచ్చిందనేది కూడా స్పీకర్ విడివిడిగా గెజిట్ విడుదల చేశారు. అందులో తమపై వచ్చిన ఫిరాయింపు ఆరోపణలకు ఏ ఎమ్మెల్యే ఎలాంటి వివరణ ఇచ్చారు, ఏ ఎమ్మెల్యేపై వచ్చిన అనర్హత పిటిషన్లు చట్టం ముందు ఎందుకు నిలువలేకపోయాయనేది వివరంగా పేర్కొన్నారు. గతంలో తమిళనాడు, మణిపూర్ అసెంబ్లీలతో పాటు ఇతర హైకోర్టుల్లో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను, సుప్రీం కోర్టు తీర్పులను స్పీకర్ ఈ గెజిట్ లో ఉదాహరించారు.
ఇంకా వివరణ ఇవ్వని దానం..
సుప్రీం కోర్టు ఇచ్చిన గడువు గురువారంతో ముగియడంతో.. శుక్రవారం ఈ ఐదుగురు ఎమ్మెల్యేలపై ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానానికి స్పీకర్ పంపించనున్నారు. మిగతా ముగ్గురు ఎమ్మెల్యేలపై విచారణ పూర్తయినా.. వారిపై కూడా తీర్పును గురువారం వెల్లడిస్తారని అంతా భావించినా వాయిదా వేశారు. ఇక కడియం తనకు వచ్చిన నోటీసుకు బుధవారం స్పీకర్ కు లిఖిత పూర్వక వివరణ ఇవ్వగా, దానం ఒక్కరే ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదు.
