సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పని చేయండి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పని చేయండి : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 
  • వికారాబాద్ జిల్లా అధికారులకు ఆదేశం

వికారాబాద్, వెలుగు : జిల్లా అభివృద్ధికి వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశించారు.  మంగళవారం అసెంబ్లీ కాన్ఫరెన్స్ హాల్​లో  పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలు రామ్మోహన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, అడిషనల్ కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి జిల్లా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. అధికారులు, ప్రజా ప్రతినిధుల సహకారంతో జిల్లాను అభివృద్ధిపథంలో తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సూచించారు.

ప్రభుత్వ ఆరు గ్యారంటీల అమలుకు అధికారులు కో ఆర్డినేషన్​తో పనిచేసి జిల్లా అభివృద్ధికి తోడ్పడాలని తెలిపారు. ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే విధంగా రాష్ట్ర పురోగతి ఉంటుందని పేర్కొన్నారు. జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని రక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఇందుకు ఆర్డీవోలు తగు చర్యలు తీసుకొని నివేదికలు సమర్పించాలని స్పష్టంచేశారు.

ఆర్అండ్ బీ, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులు రోడ్ల మరమ్మతులు చేపట్టేందుకు రిపోర్టును అందించాలని తెలిపారు. జిల్లా అభివృద్ధికి దిశ, దశను నిర్దేశించిన స్పీకర్​కు కలెక్టర్ నారాయణరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. అంతకుముందు స్పీకర్​ను పరిగి, తాండూర్ ఎమ్మెల్యేలను జిల్లా అధికారులు సన్మానించారు.