తెలంగాణ విద్యుత్ రంగంలో ఆస్తులు,అప్పులు

తెలంగాణ విద్యుత్ రంగంలో ఆస్తులు,అప్పులు

బీఆర్‌‌ఎస్ పాలకులు విద్యుత్ సంస్థలను అప్పుల ఊబిలో ముంచారు. ముందుగా ఆస్తులు, అప్పుల విషయంలో బీ‌‌ఆర్‌‌ఎస్ పాలకుల వాదన ఏంటో చూద్దాం.

బీఆర్‌‌ఎస్ పాలకుల వాదన 

విద్యుత్ రంగంలో అప్పులు చేసిన మాట వాస్తవమేననీ, కానీ అప్పులకు మించి తాము భారీగా ఆస్తులను నెలకొల్పామనీ, ఈ ఆస్తుల ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులను తీర్చడం కష్టం కాదనీ బీ‌‌ఆర్‌‌ఎస్  నాయకుల వాదన. విద్యుత్ రంగంలో ఆస్తుల కల్పనకు తాము చేసిన అప్పులు రూ.78,553 కోట్లు కాగా, నిర్మించిన ఆస్తుల విలువ రూ.1,37,571 కోట్లనీ బీ‌‌ఆర్‌‌ఎస్ నాయకులు లెక్కలు చెబుతున్నారు. ఇందులో నిజానిజాలేంటో చూద్దాం..

విద్యుత్ రంగంలో చేసిన అప్పులెన్ని? కూడబెట్టిన ఆస్తులెన్ని?

బీ‌‌ఆర్‌‌ఎస్ నాయకులు చెప్పే రూ.78,553 కోట్ల అప్పుల లెక్కలు కేవలం బ్యాంకుల దగ్గర తెచ్చిన 
దీర్ఘకాలిక రుణాల లెక్కలు. అయితే విద్యుత్ సంస్థలు అనేక కారణాల రీత్యా ఈ తొమ్మిదేండ్లలో అనేక సంస్థలకు వేలకోట్ల రూపాయలు దీర్ఘకాలంగా బకాయిలు పడ్డారు. దీర్ఘకాలంగా తీర్చలేని ఇతర బకాయిలు అప్పుల కోవలోకే వస్తాయి. ఇదివరకే చెప్పినట్టు కేవలం సింగరేణి సంస్థ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్తుకు చెల్లించాల్సిన  బకాయిలు 2023 నాటికి రూ 20,000 కోట్లు దాటాయి. 

ఇక బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వం చెబుతున్న ఆస్తుల లెక్క చూద్దాం 

విద్యుత్ రంగంలో రూ.1,37,571 కోట్ల రూపాయల ఆస్తులు నిర్మించినట్లు బీ‌‌ఆర్‌‌ఎస్ నాయకులు చెబుతున్నారు. వీళ్ళు చెప్పిన లెక్కల వివరాల్లోకి వెళ్ళేముందు, వాళ్ళు చెప్పిన లెక్కల ప్రకారం కూడా ఆస్తుల విలువ, చేసిన అప్పుల విలువ కన్నా రూ.26,012 కోట్లు తక్కువ (1,63,583-–1,37,571) అని మనం గమనించాలి. దీనిని “నికర విలువ” అంటారు. విద్యుత్ సంస్థల ఆస్తులన్నీ అమ్మినా, మొత్తం అప్పులు తీరవని స్పష్టమౌతున్నది.

అవి నిజమైన ఆస్తులు కావు.. ప్రభుత్వ బకాయిలు 

బీఆర్‌‌ఎస్ పాలకులు చెబుతున్న ఆస్తుల స్వరూప, స్వభావాలను నిశితంగా పరిశీలిస్తే, ఈ ఆస్తులు కూడా నిజమైన ఆస్తులు కావనీ, ఇవన్నీ కేవలం కాగితపు లెక్కలేననీ ఈ కింది వివరణ చూస్తే మనకు తేలికగా అర్దమౌతుంది.

ఆస్తులు కావవి.. రావాల్సిన బకాయిలు  

మొదటగా పంపిణీ సంస్థల (DISCOMS)ఆస్తులను పరిశీలిద్దాం. డిస్కమ్​ల ఆస్తులు రూ 59,132 కోట్లుగా చూపెడుతున్నారు. కానీ ఇందులో ప్రభుత్వం డిస్కమ్ లకు చెల్లించాల్సిన సబ్సిడీ బకాయిలు రూ.12,550 కోట్లు, అలాగే వివిధ ప్రభుత్వ విభాగాలు చెల్లించాల్సిన బకాయిలు రూ.28,842 కోట్లు. ఈ లెక్కన ప్రభుత్వం బాకీ పడ్డ మొత్తం బకాయిలు రూ. 41,392 కోట్లు. అకౌంటింగ్ సూత్రాల ప్రకారం ఒక సంస్థకు రావాల్సిన బకాయిలను ఆస్తులుగా చూపిస్తారు. అందులో భాగంగానే పై రూ.41,392 కోట్లను డిస్కమ్​ల ఆస్తులుగా చూపించారు. కానీ, ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వకుండా ఎగ్గొట్టిన మొత్తాలని మనకు తెలుసు. కాబట్టి వీటిని ఆస్తులుగా పరిగణించడం అవివేకం.

అంటే డిస్కమ్​ల ఆస్తులుగా చూపెట్టిన వాటిలో సుమారు 70% ప్రభుత్వ బకాయిలే. అలాగే జెన్ కో ఆస్తులు రూ.53,963 కోట్లుగా పేర్కొన్నారు. ఇందులో  రూ 9,743 కోట్లు డిస్కమ్ లు జెన్కో కు పడ్డ బకాయిలే. ప్రభుత్వం సబ్సిడీలు చెల్లించక పోవడంతో, డిస్కమ్​లు జెన్ కోకు పడ్డ బకాయిలు ఇవి. వీటిని కూడా ఆస్తులుగా పరిగణించకూడదు. ట్రాన్స్​కో  రూ.24,476 కోట్ల ఆస్తులలో సుమారు రూ 4,028 కోట్లు డిస్కమ్ ల ఖర్చుల కోసం ట్రాన్స్ కో తీసుకున్న అప్పులే. కాబట్టి వీటిని కూడా ఆస్తులుగా పరిగణించలేము.

ఈ లెక్కన మొత్తం రూ 1,37,571 కోట్ల విద్యుత్ సంస్థల ఆస్తులలో రూ 55,163 కోట్లు నిజమైన ఆస్తులు కావు. మిగిలిన ఆస్తుల విలువ రూ 82,408 కోట్లు మాత్రమే. మరోవైపు విద్యుత్ సంస్థల మొత్తం అప్పులు  రూ 1,63,583 కోట్లు. అంటే మొత్తం ఆస్తులను అమ్మినా ఇంకా రూ 81,175కోట్ల అప్పులు మిగులుతాయి (1,63,583- – 82,408).  బీ‌‌ఆర్‌‌ఎస్  ప్రభుత్వ పాలన విద్యుత్ సంస్థలకు ఉరిపాశంలా మారిందని మనకు స్పష్టమౌతున్నది.

బీ‌‌ఆర్‌‌ఎస్ ప్రభుత్వం చేసిన మొత్తం అప్పుల వివరాలు
బ్యాంకుల నుంచి తెచ్చిన దీర్ఘకాలిక రుణాలు
78,553 కోట్లు

వివిధ సంస్థలకు చెల్లించాల్సిన దీర్ఘకాలిక బకాయిలు
85,030 కోట్లు

మొత్తం అప్పులు

1,63,583 కోట్లు

కె. రఘు, విద్యుత్వ రంగ నిపుణుడు