సర్కారు తీరు మారితేనే మహిళలకు భరోసా

సర్కారు తీరు మారితేనే మహిళలకు భరోసా

విమెన్ కమిషన్ ముందు సవాళ్లెన్నో

మాటలు గొప్పగా చెప్పి జనాల్ని మాయ చేయడంలో సీఎం కేసీఆర్‌‌‌‌ను మించినోళ్లు ఉండరేమో! రాష్ట్రంలో మహిళలకు పెద్ద పీట వేస్తామని, వారి సాధికారతకు కృషి చేస్తామని చెప్పిన ఆయన తెలంగాణ తొలి కేబినెట్‌‌లో కనీసం ఒక్క మహిళా మంత్రికి కూడా స్థానం ఇవ్వలేదు. మహిళలకు భరోసా ఇచ్చి, వాళ్ల హక్కుల పరిరక్షణ కోసం నిలిచే మహిళా కమిషన్ విషయంలోనూ ఇదే తీరు. రాష్ట్రం ఏర్పడిన ఆరున్నరేండ్ల తర్వాత తొలి మహిళా కమిషన్ చైర్‌‌‌‌పర్సన్ నియామకం జరిగింది. దీనిని బట్టే మహిళల రక్షణ, వాళ్ల అభివృద్ధిపై మన ముఖ్యమంత్రి చిత్తశుద్ధి ఏంటో అర్థమైపోతోంది. ఇన్నేండ్లుగా కమిషన్ ఎదుట పడి ఉన్న పెండింగ్ కంప్లైంట్స్ సహా ఎన్నో సమస్యలు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్‌‌‌‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డికి వెల్‌‌కమ్‌‌ చెబుతున్నాయి. ఈ సవాళ్లను ఎదుర్కొని సమస్యలను పరిష్కరిస్తేనే రాష్ట్రంలోని మహిళలకు భరోసా ఇచ్చినట్టవుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహకారం అందుతుందో చూడాలి.

రాష్ట్రంలో మహిళలపై జరిగే హింస, వేధింపులు, దాడులపై చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కలిగిన కమిషన్ అబలలకు ఒక భరోసా ఇస్తుంది. దేశంలోనే దాదాపు ఆరున్నరేండ్ల పాటు మహిళా కమిషన్ సభ్యులు, చైర్‌‌‌‌పర్సన్ నియామకం జరగని ఏకైక రాష్ట్రం తెలంగాణ. ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు, ప్రజాసంఘాల పోరాటాలు, కోర్టు హెచ్చరికలతో ఎట్టకేలకు ఇటీవల రాష్ట్ర తొలి మహిళా కమిషన్ చైర్‌‌‌‌పర్సన్‌‌గా సునీతా లక్ష్మారెడ్డిని నియమిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2010 నుంచి 2014 వరకు స్ర్తీ శిశు సంక్షేమ శాఖ మంత్రిగా పనిచేసిన ఆమెను మహిళా కమిషన్ చైర్‌‌‌‌పర్సన్‌‌గా నియమించడం స్వాగతించదగ్గ విషయమే. 2004 నుంచి 2009 వరకు శాసనసభ శిశు సంక్షేమ కమిటీ చైర్‌‌‌‌పర్సన్‌‌గా పనిచేసిన అనుభవం కూడా ఆమెకు ఉంది. అయితే ఆరున్నరేండ్లుగా ఖాళీగా ఉన్న పదవిలోకి వచ్చిన ఆమెకు ఆ బాధ్యతల నిర్వహణ ఒక సవాలే అని చెప్పాలి. రాష్ట్రంలో 2019 డిసెంబర్ వరకు మహిళా కమిషన్‌‌లో 138 ఫిర్యాదులు పెండింగ్‌‌లో ఉన్నాయి. గడిచిన ఏడాదిలో మరో వందకు పైగా కంప్లైంట్స్ వచ్చాయి. అయితే ఇంతకాలం మహిళా కమిషన్‌‌ విధులు చూసే వాళ్లు లేకపోవడంతో గడిచిన ఆరున్నరేండ్లుగా న్యాయం కోసం మహిళా కమిషన్ మెట్లెక్కిన బాధితులకు నిరాశే ఎదురైంది.

బాధితులకు అండ, నేరగాళ్లకు శిక్షలూ లేవ్

హైదరాబాద్ శివార్లలో జరిగిన దిశా ఘటనలో సత్వరమే స్పందించిన పోలీసులు, మరిన్ని కొన్ని దారుణాలు, అత్యాచారాలు, హత్యల విషయంలో బాధితులకు తీవ్ర అన్యాయం జరిగినా పట్టించుకోలేదు. వరుస అత్యాచారాలు, హత్యలు చేసిన హజీపూర్‌‌‌‌కు చెందిన శ్రీనివాస్ రెడ్డి విషయంలో ప్రభుత్వం గానీ, టీఆర్‌‌‌‌ఎస్ మహిళా నేతలు గానీ బాధితుల కుటుంబాలను కలిసి పరామర్శించకపోవడం సిగ్గుచేటు. ఆరేడుగురు బాలికలపై దారుణంగా అకృత్యాలు చేసి, చంపి బావిలో పూడ్చిపెట్టిన కిరాతకుడు శ్రీనివాస్ రెడ్డి విషయంలో ప్రభుత్వ తీరు తీవ్ర విమర్శలకు గురిచేస్తోంది. ఈ ఘటనపై ట్విట్టర్‌‌‌‌లో స్పందించిన మంత్రి కేటీఆర్ హాజీపూర్ వెళ్లి బాధిత కుటుంబాలను కలిసి న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. కానీ ఏళ్లు గడుస్తున్నా కేటీఆర్.. ఇప్పటికీ హాజీపూర్ వెళ్లింది లేదు, బాధితులకు న్యాయం చేసింది లేదు. అటు ఖమ్మంలో 11 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే తెలంగాణ సర్కార్ నుంచి స్పందన లేదు. చివరకు ఆ బాలిక చికిత్స పొందుతూ మరణించింది. నిందితుడికి ఇప్పటికీ శిక్ష పడలేదు. ఆదిలాబాద్ జిల్లాలో దళిత మహిళపై అత్యాచారం, హత్య జరిగినా అదే నిర్లక్ష్యం. వరంగల్ లో తొమ్మిది నెలల చిన్నారిపై అత్యాచారం, హత్య జరిగిన ఘటనలో ప్రభుత్వ స్పందన ఏ తీరుగా ఉంది. బడుగు. బలహీన వర్గాలపై టీఆర్ఎస్‌‌కు అంత చిన్న చూపు ఎందుకో? కనీసం పోలీసులకు ఫిర్యాదు చేసినా పెద్దగా పట్టించుకోకపోవడంతో నిత్యం మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. మహిళా కమిషన్ లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనపై సీరియస్‌‌గా స్పందించే దిక్కు లేకుండా పోయింది. మహిళా కమిషన్ చైర్‌‌‌‌పర్సన్‌‌ ఈ ఘటనల్లో బాధితులను ఆదుకోవాలి. నేరాలు చేసిన దుర్మార్గులకు కఠిన శిక్షలు పడేలా చూడాలి. ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఏ మాత్రం సహకారం అందుతుందన్నదే పెద్ద ప్రశ్న.

మహిళా కమిషన్ ఏం చేయాలి?

మహిళా కమిషన్ చైర్ పర్సన్, సభ్యులు రాష్ర్ట వ్యాప్తంగా పర్యటించి మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, జరుగుతున్న అన్యాయాలు, దాడులపై క్షేత్రస్థాయి నుంచి అధ్యయనం చేయాలి. జిల్లాల వారీగా కమిషన్ సభ్యులను నియమించుకుని అక్కడి నుంచి వచ్చే ఫిర్యాదుల తక్షణ పరిష్కారం కోసం కృషి చేయాలి. పరివారక్ మహిళా లోక్ అదాలత్ ద్వారా బాల్య వివాహాల నిరోధానికి కృషి చేయాలి. వరకట్న నిషేధ చట్టం–1961ని సమీక్షించి, ఆస్తి పంపకాల విషయంలో స్ర్తీలకు వాటా దక్కేలా చేయాలి. మహిళల రక్షణ, సంక్షేమం కోసం రాష్ర్ట ప్రభుత్వానికి సూచనలు ఇవ్వాలి. మహిళా హక్కుల ఉల్లంఘన జరిగినప్పుడు సంబంధిత సంస్థల దృష్టికి తీసుకెళ్లి పరిష్కార మార్గాలు చూపించాలి. మహిళల రక్షణకోసం ఉద్దేశించిన చట్టాలు పక్కాగా అమలయ్యేలా చూడాలి. అన్ని రంగాల్లో స్ర్తీల పట్ల కొనసాగుతున్న వివక్షపై అధ్యయనం జరపాలి. మహిళా జైళ్లను తనిఖీ చేసి, వాళ్ల హక్కులకు రక్షణ కల్పించాలి. విధినిర్వహణలో సివిల్ కోర్టు అధికారాలు కలిగిన ఈ కమిషన్.. స్ర్తీల పట్ల అనుచితంగా ప్రవర్తించిన వారికి సమన్లు జారీ చేయాలి. మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా పూర్తి వివరాలు సేకరించి, దోషులకు శిక్ష పడేలా తక్షణ చర్యలు చేపట్టాలి. స్త్రీలకు భరోసా కల్పించడంతో పాటు వారు తమ కాళ్లపై తాము నిలబడగలిగే ధైర్యాన్ని పెంచేందుకు ప్రయత్నాలు చేయాలి.

సర్కారు ఆలోచనా విధానం మారాలి

యాక్సిడెంట్లు, హత్యలు, అత్యాచారాలు.. ఇలా ఏ నేరం జరిగినా వాటిలో ఇతర కారణాలు ఓ వైపు అయితే సగానికి పైగా నిందితులపై లిక్కర్ ప్రభావం ఉంటోందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ నేరాలు తగ్గాలంటే ముందు లిక్కర్‌‌‌‌ కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు లిక్కర్‌‌‌‌ను ఆదాయం తెచ్చే మార్గంగా చూడకుండా ఆల్టర్నేటివ్స్ ఆలోచించాలి. ఆర్టీఐ ద్వారా నేను సేకరించిన సమాచారం ప్రకారం తెలంగాణ వ్యాప్తంగా 17,634 బెల్ట్ షాపులున్నాయి. ఈ బెల్ట్ షాపులన్నీ మూసివేసేందుకు మహిళా కమిషన్ నడుం బిగించాలి. ఈ బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్మకాల మూలంగానే రాష్ర్టంలో మహిళలపై అత్యాచారాలు, హత్యలు అధికమవుతున్నాయి. క్రమంగా రాష్ట్ర వ్యాప్తంగా వైన్‌‌ షాపుల సంఖ్యను కూడా తగ్గించేలా ప్రభుత్వాన్ని కోరాలి. అలాగే మహిళలపై జరుగుతున్న దాడులకు మూలాలను గుర్తించి, అసలు ఆ నేరప్రవృత్తి పెరగకుండా చేసేందుకు తీసుకోవాల్సిన చర్చలపై దృష్టి పెట్టాలి. సెమినార్లు, వర్క్ షాపులు నిర్వహించి మహిళల సమస్యల పట్ల సమాజంలో అవగాహన కల్పించాలి. పరిష్కార మార్గాలు సూచించాలి. ఇందులో ఏ పని జరగాలన్నా మహిళా కమిషన్‌‌కు ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం అందాలి.

పీవీ హయాంలో తొలి మహిళా కమిషన్

మహిళల హక్కులు కాపాడడం, వాళ్లకు ఎదురయ్యే సమస్యలు పరిష్కరిస్తూ భరోసాగా నిలవడం కోసం 1990 ఆగస్టులో జాతీయ మహిళా కమిషన్ చట్టం చేశారు. పీవీ నరసింహారావు ప్రధానిగా ఉండగా1992 జనవరి 31న తొలి జాతీయ మహిళా కమిషన్ ఏర్పాటు చేశారు. ఈ కమిషన్ మహిళలపై ప్రభావం చూపే విధాన నిర్ణయాలకు సంబంధించి ప్రభుత్వానికి సలహా ఇస్తుంది. మహిళల హక్కులను కాపాడడం కోసం వారి తరఫున గొంతు విప్పి, వారి సాధికారతకు కృషి చేస్తుంది. రాజకీయాల్లో సమాన ప్రాతినిధ్యం, మహిళా ఉద్యోగులు, కూలీలపై వివక్ష, వేధింపులపై చర్యలు వంటి అంశాలు కమిషన్ పరిధిలోకి వస్తాయి. అధికారులు చట్టాలను ఉల్లఘించి స్ర్తీల హక్కులకు భంగం కలిగించేలా వ్యవహరిస్తే ఆ ఫిర్యాదులను స్వీకరిస్తుంది. బాలికలు, స్త్రీలపై దాడులు, అత్యాచారాలు, వేధింపులు జరిగితే ఆ నేరాలపై తీవ్రంగా స్పందిస్తుంది. బాధితులకు తక్షణ న్యాయం చేయడానికి కృషి చేస్తుంది. అబలల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఉద్దేశించిన చట్టాల అమలుకు కృషి చేస్తుంది. ఇంతటి కీలకమైన మహిళా కమిషన్ ఏర్పాటు విషయంలో కేసీఆర్ సర్కారు ఎంత నిర్లక్ష్యం ప్రదర్శించిందో అంతా చూశాం.

– ఇందిరాశోభన్ పోశాల, టీపీసీసీ అధికార ప్రతినిధి

For More News..

నౌకరీ వచ్చినా పోస్టింగ్​ ఇస్తలే.. 140 మంది ఎదురుచూపులు

క్యూఆర్ కోడ్ స్కానింగ్‌తో ఫ్రాడ్స్.. హెచ్చరిస్తున్న పోలీసులు

ఫిట్​మెంట్ 43% పైనే ఇయ్యాలి.. తగ్గిస్తే తడాఖా చూపిస్తం..