ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల సంచారం ఆధారంగా శుభ.. అశుభ ఫలితాలు ఉంటాయి. జాతకంలో గ్రహాలు కొన్ని స్థానాల్లో బలహీనంగా ఉంటే కచ్చితంగా కొన్ని పరిహారాలు చేయాలి. దీనిలో భాగంగా గ్రహాలకు బలం చేకూరేందుకు స్నానం చేసే నీటిలో కొన్నింటిని కలిపిచేస్తే చాలు. స్నానంలో ఏ పదార్థాలను కలిపితే నవగ్రహ దోషాలుతొలగిపోతాయో తెలుసుకుందాం..
జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల యొక్క దుష్ప్రభావాలను తొలగించడానికి, అదృష్టం పొందడానికి అనేక రకాల పరిహారాలు చెప్పబడ్డాయి. నవగ్రహ దోషాలను తొలగించడానికి జపం, తపస్సు, దానముతో పాటు స్నానం చేయడం కూడా అత్యంత ప్రభావవంతమైన పరిహారమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
స్నానం చేసేటప్పుడు గంగమ్మకు నమస్కరించాలి, అనంతరం ప్రత్యక్షనారాయణుడు అయిన సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి. జాతకంలో గ్రహ దోషాలు తొలగిపోవడానికి, ఇంట్లోని ప్రతికూల శక్తిని దూరం చేసుకోవడానికి ఉదయం బ్రహ్మ ముహూర్తంలో (సూర్యోదయానికి ముందు) స్నానం చేయడం చాలా మంచిదని పండితులు చెబుతున్నారు.
ఆదివారం : స్నానం చేసే నీటిలో కుంకుమపువ్వు కానీ ఎర్రటి పూలు కానీ నీటిలో కలిపి స్నానం ఆచరిస్తే సూర్య గ్రహ దోషం తగ్గిపోతుంది.
సోమవారం : ఈ రోజుకు అధిపతి చంద్రుడు.. చంద్రదోషంతో బాధపడే వారు సోమవారం రోజున స్నానం చేసే నీటిలో కొద్దిగా పచ్చ కర్పూరం లేదా రోజ్ వాటర్ కలుపుకుని స్నానం చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
మంగళవారం : కుజ దోషం తొలగాలంటే మంగళవారం ఎర్ర చందనం లేదా ఎర్రని పూల రేకులను నీటిలో వేసి స్నానం చేయాలి.
బుధవారం : బుధ గ్రహ దోషం తొలగిపోయేందుకు నీటిలో జాజికాయ పొడి, కొద్దిగా తేనె కలిపి స్నానం చేయడం మంచిది. అదే సాయంత్రం స్నానం చేసే నీటిలో గంగా జలం కాని.. రాళ్ల ఉప్పు కానివేసి ఆ నీటితో స్నానం చేయాలి.
గురువారం : బృహస్పతి అధిపది.. గురుడి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలంటే గురువారం రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపు వేసి స్నానం చేయడం వల్ల గురు గ్రహ దోషాలు తొలగి, అదృష్టం, ఆరోగ్యం చేకూరుతాయి.
శుక్రవారం : శుక్ర దోషం తొలిగేందుకు రోజ్ వాటర్ లేదా మంచి సువాసన వచ్చే ద్రవ్యాలను నీటిలో కలిపి స్నానం చేయాలి. యాలకులను ఉడికించి కూడా నీటిలో కలుపుకోవచ్చని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.
శనివారం : శని భగవానుడి చాలా ఇష్టమైన రోజు . నల్ల నువ్వులు, ఆవాల నూనె లేదా కొద్దిగా గింజలను నీటిలో వేసి స్నానం చేయడం వల్ల శని దోషాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
రాహు - కేతు దోషాలు: రాహు దోషానికి వాము, కస్తూరి, కేతు దోషానికి ఎర్ర చందనం నీటిలో కలిపి స్నానం చేయాలి.
మధ్యాహ్నం 12 గంటల తర్వాత స్నానం చేయడం వల్ల దోషాలు పెరుగుతాయని, కాబట్టి ఉదయాన్నే స్నానం ముగించాలని నమ్ముతారు.స్నానం చేసే సమయంలో ఇష్టదైవాన్ని లేదా నవగ్రహ మంత్రాలను మనసులో స్మరించుకోవాలి. ఈ నియమాలను అనుసరిస్తూ ఆయా రోజుల్లో స్నానం ఆచరించి భగవంతుడికి నమస్కరిస్తే గ్రహదోషాల నుంచి ఉపశమనం లభిస్తుందని పండితులు చెబుతున్నారు.
Disclaimer: పైన అందించిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. ఈ కథనాన్ని జ్యోతిష్య నిపుణుల సలహాలతో పాటు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం వినియోగించి రూపొందించబడింది. ఈ సమాచారాన్ని V6 వెలుగు యాజమాన్యం లేదా ఉద్యోగులు ధృవీకరించరు. మీకున్న జ్యోతిష్య సమస్యలకు నిపుణులను సంప్రదించటం ఉత్తమం.
