శ్రీ క్రోధి నామ పంచాంగం : కన్యరాశి వారి జాతకం ఎలా ఉందంటే?

శ్రీ క్రోధి నామ పంచాంగం : కన్యరాశి వారి జాతకం ఎలా ఉందంటే?

ఆదాయం : 5
వ్యయం      : 5
రాజపూజ్యం : 5
అవమానం  : 2

ఉత్తర 2,3,4 పాదములు; హస్త 1,2,3,4 పాదములు; చిత్త 1, 2 పాదములు, మీ పేరులో మొదటి అక్షరం టో, పా, పి, పూ, షం, ణా, ఠా, పే, పో

గురువు 9.4.024 నుండి 1.5.2024 వరకు మేషరాశి యందు తదుపరి 29.3.2025 ఉగాది వరకు తామ్రమూర్తిగా సంచారం. శని 9.4.2024 నుండి 29.3.2025 ఉగాది వరకు లోహమూర్తిగా సంచారం. రాహుకేతువులు 9.4.2024 నుండి 29.3.2025 వరకు తామ్రమూర్తులుగా సంచారం.

ఈ రాశి వాళ్లకు సామాన్య ఫలితములు ఉండగలవు. అర్థం కాని పరిస్థితులు కలిగి ఉంటారు. రైతులకు ముహూర్తబలంతో కొంత ఉపశమనం. వృత్తి, ఉద్యోగ వ్యాపారములలో ఉన్నవారికి పెద్ద సమస్యలు లేకుండా సాఫీగా జరిగిపోగలదు. లాయర్లు, డాక్టర్లు ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించగలరు. కాంట్రాక్టర్లు టెండరు జాగ్రత్తగా పరిశీలించాలి. రాజకీయ నాయకులు తక్కువగా మాట్లాడగలరు. వెండి, బంగారం, టింబరు వ్యాపారులు జాగ్రత్తలు పాటించగలరు. సిమెంట్, ఐరన్ వారికి అనుకూలం. బిగ్ ఇండస్ట్రీ వాళ్లకి అనుకూలం.

స్మాల్ ఇండస్ట్రీ వారికి సామాన్యంగా ఉంటుంది. ఎవరు ఏ విధమైన వ్యాపారంలో ఉన్నా డబ్బు విషయంలో అనవసరమైన మాటలు పడవలసి వచ్చును. ఏదైనా మీరు ఎంతవరకు మాట్లాడాలి అనేది జాగ్రత్తలు తీసుకొనగలరు. ఆకస్మిక ధనాదాయం ఉంది. కాని చాలా జాగ్రత్తగా ఉన్నప్పుడు మాత్రమే అధిక రాబడి. నిర్లక్ష్యంగా ఉంటే ఎంత వచ్చినా.. వచ్చింది వచ్చినట్లు ఖర్చు అవుతుంది.  భూములు, గృహనిర్మాణం వస్తువాహనములు సమకూర్చుకొనుటకు అవకాశములు ఉన్నవి. జాగ్రత్తలు ఎక్కువగా పాటించగలరు. నిగ్రహశక్తి కలిగిన వాళ్లకి సంఘంలో ఉన్నత పదవులు.

మీ సామర్ధ్యం,  ధైర్య సాహసములు, ఓర్పు, తక్కువగా మాట్లాడి ఎక్కువ పనులు చేసుకునే సామర్ధ్యం ఉన్నప్పుడు మాత్రమే ఈ అవకాశములు. నా గొప్పతనం అనుకున్నారా ఎక్కడో ఒకచోట ఇరుక్కుపోగలరు. అంతా దేవుడి దయ అనుకోవాలి. ఉత్తర నక్షత్రం వాళ్లు జాతి కెంపు ధరించండి. ఆదిత్య పారాయణ చేయండి. అరసవెల్లిలో పూజలు, గోధుమలు దానం ఇవ్వండి. హస్త నక్షత్రం వాళ్లు ముత్యం ధరించండి. ముత్యాల మాల ధరించగలరు. దుర్గాదేవికి పూజలు శక్తి సామర్ధ్యములు పెంచగలవు. శుక్రవారం సాయంత్రం కుంకుమ, పూజ చీర జాకెట్ ముక్కలు, గాజులు దండ, నిమ్మకాయల దండ,  కొబ్బరికాయలు 5, పానకం, వడపప్పు, స్వీట్ అమ్మవారి అలంకరణలో ప్రత్యేక పూజలు చేయించండి.

చిత్త నక్షత్రం వాళ్లు  పగడం ధరించండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజలు చాలా అవసరం చేయించగలరు. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, రాహుకేతువులకు పూజలు నవగ్రహ ప్రదక్షిణలు దానాలు తల్లిదండ్రులకి పాదాభివందనములు ఆచరించిన వాళ్లకి ఈ సమస్యలు తెలియకుండా తీరిపోగలవు. మీరు కుటుంబ పరమైన బాధ్యతలు వహించవలసి వస్తుంది. యోగ, ధ్యానం, చేయండి. పరిష్కారములు ఉన్నవి. అదృష్ట సంఖ్య 6.


చైత్రం: ప్రతి విషయంలో ఆటంకములు కలిగి ఉన్నారు. ప్రయాణంలో అనేక సమస్యలు. జీవిత భాగస్వామికి అనారోగ్య సమస్యలు. తొందరపాటు నిర్ణయములతో మానసిక సమస్యలు రాగలవు. అధికారులు కొంతవరకు అనుకూలత ఉంటుంది. సుబ్రహ్మణ్యేశ్వరస్వామి పూజలు చేయండి.

వైశాఖం: ఆదాయ వ్యయములు బ్యాలెన్స్ చేయగలరు. ఎంత ధనం వచ్చినా బ్యాలెన్స్​గా ఉండగలరు. విలాసంగా గడుపుటకు మనసు ఉత్సాహం చూపగలదు. దుర్గాదేవి దర్శనం పూజలు వలన ఉత్సాహంగా ఉంటారు. 

జ్యేష్టం: వివాదములకు దూరంగా ఉండండి. వృత్తి, ఉద్యోగము లందు అనుకూలత. ప్రయాణములు కలిసి రాగలవు. ఆకస్మిక ధనయోగం. అధిక ఖర్చులు. ఆధ్యాత్మిక విషయ పరిజ్ఞానములు, యోగ, ధ్యానం వంటి వాటిమీద శ్రద్ధ పెట్టండి.

ఆషాఢం: బంధుమిత్రుల కలయిక. ప్రయత్న లాభం. కార్యసాధన ద్వారా సంతృప్తి. గృహాలంకరణకు పెద్ద పీట. కొన్ని పనులు వాయిదా వేయుట మంచిది. నవగ్రహ ప్రదక్షిణలు దుర్గాదేవి స్తోత్రాలు చేయండి.

శ్రావణం: ప్రయాణాల్లో అజాగ్రత్త వల్ల దొంగతనములు. గృహంలో కూడా నిర్లక్ష్యంగా ఉండరాదు. అనవసర ఖర్చులు వాయిదా వేయండి. ఆర్భాటాలకు సమయం కాదు. తొందరపాటు వలన సమస్యలు రాగలవు. అరసవెల్లి సూర్య దర్శనం. ప్రదక్షిణం, ఆదిత్య పారాయణ చేయండి.

భాద్రపదం: విఘ్నేశ్వర పూజలు చేయుట విఘ్నములు తొలగును. నూతన ప్రయత్నములకు శ్రీకారం చుట్టండి. పితృదేవతల ఆరాధన వలన పెండింగ్​లో ఉన్న పనులు నెరవేరగలవు. ఆర్థికంగా సంతృప్తి ఉంటుంది. స్కందగిరి దేవాలయం దర్శనంతో లాభములు.

ఆశ్వయుజం: ఎవరితో గొడవలకు అవకాశమివ్వరాదు. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించాలి. మీ తొందరపాటు నిర్ణయం వలన అనేక సమస్యలు రాగలవు. అనారోగ్యం. దైవబలం. దుర్గా మాత, గాయత్రి, శ్రీ లలితా దేవి పూజలు చేయాలి.

కార్తీకం: చాలా విషయాల్లో అనుకూలత కలిగి ఉండగలరు. ఆయుధముల వలన ప్రమాదములు. మానసిక సమస్యలు. తక్కువగా మాట్లాడగలరు. నవగ్రహ ప్రదక్షిణలు దానాలు చేయండి.

మార్గశిరం: వృత్తి ఉద్యోగములందు అనుకూలత. ఆర్థికంగా సంతృప్తి ఉంటుంది. మిత్రుల వలన కొంత అనుకూలత. ఈ సమయాన్ని వాడుకుని ప్రగతిపథంలో సాగాలి. మహన్యాస పూర్వక రుద్రాభిషేకం చేయండి.

పుష్యం: అనవసర విషయములలో తలదూర్చి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు. చాలా జాగ్రత్తగా ఉండాలి. దూర ప్రయాణములను వాయిదా వేయండి. అధికారులతో వినయంగా ఉండండి. తొందరపాటు నిర్ణయములు వాయిదా వేయండి. దుర్గాదేవి పూజలు చేయండి.

మాఘం: ఆదాయ వనరుల కొరకు ప్రయత్నములు ఫలించగలవు. మీ ఆధి పత్యానికి అవకాశం. ఉన్నత ఆశయాల పట్ల శ్రద్ధ ఉంచండి. లోక కళ్యాణమునకు, ఆరాధనలకు అనుకూలమైన రోజులు. దైవకళ్యాణమునకు అనుకూలంగా ఉండండి.

ఫాల్గుణం: దూర ప్రయాణాల్లో ప్రమాదములు. వాయిదా వేయండి. తప్పనిసరి అయితే శకునం చూసుకుని  రాహుకాలంను జాగ్రత్తగా గమనించండి. భార్యకు అనారోగ్య సూచనలు. భార్యాపిల్లల ఆనందంలో ఆరోగ్యం బాగుంటుంది. శివారాధన చేయండి.