రండి.. కలిసి ఫైట్ చేద్దాం! ఆర్టీసీ యూనియన్లకు అశ్వత్థామ రెడ్డి పిలుపు

రండి.. కలిసి ఫైట్  చేద్దాం! ఆర్టీసీ యూనియన్లకు అశ్వత్థామ రెడ్డి పిలుపు
  • ఆర్టీసీ యూనియన్లకు అశ్వత్థామ రెడ్డి పిలుపు
  • నేడు జేఏసీ మీటింగ్​కు హాజరు కావాలని వినతి
  • దూరంగా ఉండాలని లెఫ్ట్ యూనియన్ల నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీలో ఉద్యోగులు ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతున్నారని, యూనియన్లు లేకపోవటంతో అధికారులు ఉద్యోగులను తీవ్రంగా వేధిస్తున్నారని టీఎంయూ గౌరవ అధ్యక్షుడు అశ్వత్థామరెడ్డి అన్నారు. అన్ని యూనియన్లు కలిసి జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ జేఏసీకి తాను నేతృత్వం వహిస్తానన్నారు. ఇటీవల కలిసి వచ్చిన యూనియన్లతో సోమవారం మరోసారి ఆయన మీటింగ్ నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలని యూనియన్లను కోరారు. ఆర్టీసీలో అధికార పార్టీకి అనుబంధంగా థామస్ రెడ్డి అధ్యక్షతన టీఎంయూ ఉండగా, అశ్వత్థామ రెడ్డి ఆధ్వర్యంలో మరో టీఎంయూ ఉంది.

అలాగే సీపీఐకి అనుంబంధంగా ఎంప్లాయీస్  యూనియన్, సీపీఎంకి అనుబంధంగా ఎస్ డబ్ల్యూఎఫ్  ఉన్నాయి. తెలంగాణ జాతీయ మజ్దూర్  యూనియన్ (టీజేఎంయూ) పేరుతో హనుమంతు నేతృత్వంలో మరో యూనియన్  ఉంది. ఇక ఐఎన్ టీయూసీ, కార్మిక సంఘ్, బీఎంఎస్ ఉన్నా అవి నామమాత్రంగానే ఉన్నాయి. కార్మికుల సమస్యలపై అధికార పార్టీకి మద్దతు ఇస్తున్న థామస్  రెడ్డి టీఎంయూ కూడా మంత్రులను కలిసేందుకు ప్రయత్నాలు చేస్తున్నా అపాయింట్ మెంట్ దొరకడం లేదు.

ఎన్నో సమస్యలు

ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేసినప్పుడు యూనియన్లను సీఎం కేసీఆర్  రద్దు చేసి  వాటి స్థానంలో వెల్ఫేర్  కమిటీలను తెచ్చారు. అయితే తమ సమస్యలను ఆ కమిటీలు పరిష్కరించిన దాఖలాలు లేవని యూనియన్  నేతలు చెబుతున్నారు. యూనియన్లు లేకపోవడంతో అధికారుల వేధింపులు నిత్యం పెరుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘‘పలువురు కండక్టర్లు, డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి 8 తరువాత డ్యూటీలు ఇవ్వొద్దన్న కేసీఆర్ ఆదేశాలను అధికారులు ధిక్కరిస్తున్నారు.

ఉద్యోగులకు తక్కువ వడ్డీకి లోన్లు ఇచ్చే సీసీఎస్​కు ఆర్టీసీ మేనేజ్ మెంట్ రూ.1,100 కోట్లు బకాయిలు ఉంది. వాటిని రెండేండ్లుగా సీసీఎస్ కు ఇవ్వకపోవడంతో ఏడు వేలకు పైగా లోన్  అప్లికేషన్లు పెండింగ్ లో ఉన్నాయి” అని యూనియన్  నేతలు తెలిపారు. కార్మికుల పీఎఫ్  బకాయిలు కూడా రూ.1,500 కోట్లను ట్రస్ట్ కు ఆర్టీసీ చెల్లించాల్సి ఉంది. దాంతోపాటు ఎస్ఆర్ బీఎస్ బకాయిలు కూడా ఉన్నాయి. 2012 పీఆర్సీ బకాయిలు 50 శాతం, 2017, 2021 పీఆర్సీలు పెండింగ్ లో ఉన్నాయి. 

ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ప్లాన్

మరో ఆరు నెలల్లో రాష్ర్టంలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని యూనియన్లు నిర్ణయించాయి. ఆర్టీసీలో 45 వేల మంది ఉద్యోగులు ఉండగా వారి కుటుంబ సభ్యులతో కలిపి లక్షల సంఖ్యలో ఓట్లు ఉన్నాయి. దీంతో యూనియన్లు ఒక్క తాటిపైకి వచ్చి సమస్యల పరిష్కారానికి ఆందోళనలు, పోరాటాలపై ఐక్య కార్యాచరణ ప్రకటించనున్నాయి. 

జేఏసీ మీటింగ్​కు పోతం

ఆర్టీసీలో చాలా సమస్యలు ఉన్నయ్. ప్రభుత్వం పట్టించుకుంట లేదు. సమస్యలపై అందరం కలిసి పోరాడాల్సిన టైమ్ వచ్చింది. దీనిపై రాష్ట్ర కమిటీలో చర్చిస్తం. మరోసారి మంత్రులను కలిసి సమస్యల గురించి ప్రస్తావిస్తం. పరిష్కారం చేయకపోతే  ఈ నెల 22న  జేఏసీలో జాయిన్ అయి పోరాడుతం.
- టీఎంయూ రాష్ట్ర కమిటీ (థామస్ రెడ్డి వర్గం)