ట్రక్కులో 46 మంది ఆకలిచావు

ట్రక్కులో 46 మంది ఆకలిచావు

46 మంది ఒక ట్రక్కు కంటైనర్ లో ఊపిరాడక ఉక్కిరిబిక్కిరి అవుతూ, దాహం కేకలతో అలమటిస్తూ దిక్కుతోచని స్థితిలో ప్రాణాలు కోల్పోయారు.  వీరంతా మెక్సికో సరిహద్దు మీదుగా అక్రమంగా అమెరికాలోకి ప్రవేశించేందుకు కంటైనర్ లో దాక్కొని వచ్చిన వలస కార్మికులని మీడియాలో కథనాలు వచ్చాయి. తలుపులు మూసి ఉన్న కంటైనర్ లో ఏసీ లేదు. అందులో ఉన్న ఫ్రిజ్ లో నీటి చుక్క కూడా లేదు. దీంతో దాహం, ఆకలితో అలమటించి వాళ్లు దుర్భర స్థితిలో చనిపోయి ఉంటారని భావిస్తున్నారు.

ట్రక్కు నుంచి అకస్మాత్తుగా అరుపులు..

సోమవారం సాయంత్రం టెక్సాస్ రాష్ట్రంలోని శాన్ ఆంటోనియో పట్టణ శివారు నిర్మానుష్య ప్రదేశంలో రోడ్డు పక్కన నిలబెట్టి ఉన్న ఈ ట్రక్కు నుంచి అకస్మాత్తుగా అరుపులు, కేకలు వినిపించాయి. ‘కాపాడండి’..  అంటూ ట్రక్కు నుంచి శబ్దాలు వచ్చాయి. అటువైపుగా వెళ్తున్న ఓ వ్యక్తి మూసి ఉన్న ట్రక్కు కంటైనర్ లోకి తొంగి చూశాడు. దీంతో పదులసంఖ్యలో మృతదేహాలు కనిపించాయి. మిగతవారంతా నిలబడి అరుస్తున్న దృశ్యాలు తారసపడ్డాయి. దీంతో అతడు పోలీసులకు సమాచారం అందించాడు. వారి వచ్చిన తలుపును తెరిచి 46 మంది మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. నీళ్లు, తిండి లేక తీవ్ర అస్వస్థతకు గురైన వారందరినీ హుటాహుటిన ఆస్పత్రుల్లో చేర్పించారు.  అమెరికా, మెక్సికో సరిహద్దులకు 250 కిలోమీటర్ల దూరంలో ఈ ట్రక్కును గుర్తించారు. మెక్సికో సరిహద్దు నుంచి వీరంతా అమెరికాలోకి ప్రవేశించేందుకు యత్నించారని భావిస్తున్నారు.