- పెరగనున్న పీఎఫ్ వాటా.. కావాలంటే తగ్గించుకోవచ్చు
హైదరాబాద్: కార్పొరేట్ సంస్థలు కొత్త లేబర్ కోడ్స్ అమలు చేయడానికి సిద్ధమవుతున్నాయి. వీటి వల్ల చేతికి అందే జీతం (టేక్- హోమ్ శాలరీ) తగ్గడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇక మీదట మొత్తం వేతనంలో 50 శాతం డబ్బును భవిష్య నిధి (పీఎఫ్), గ్రాట్యుటీ, ఇతర ప్రయోజనాలకు కేటాయించాలి. ఫలితంగా ఉద్యోగి చెల్లించే పీఎఫ్ వాటా పెరుగుతుంది.
ఉద్యోగి మొత్తం వేతనం (సీటీసీ)లో కనీసం 50 శాతం బేసిక్‌పే, అలవెన్స్‌ల రూపంలో ఉండాలి. పీఎఫ్ గ్రాట్యుటీ వంటి సామాజిక భద్రతా ప్రయోజనాలను లెక్కించడానికి ఈ 50 శాతం మొత్తాన్ని ప్రాతిపదికగా తీసుకుంటారు. సాధారణంగా కంపెనీలు అలవెన్సులను, డీఏలను ఎక్కువ చూపి, బేసిక్‌పేను తక్కువగా చూపుతాయి.
బేసిక్ పేలో 12 శాతం మొత్తాన్ని పీఎఫ్‌గా కట్టాలి. బేసిక్ పే తగ్గిస్తాయి కాబట్టి అవి పీఎఫ్ వాటాగా చెల్లించే మొత్తమూ తగ్గుతుంది. ఇక ముందు పీఎఫ్, గ్రాట్యుటీకి చెల్లింపులను పెంచాలి కాబట్టి పీఎఫ్‌కు ఎక్కువ కట్టాలి. ఉద్యోగి వాటా కూడా పెరుగుతుంది. ఇంతకుముందు పీఎఫ్ కోసం రూ. 100లో రూ. 30 కోత పడితే, ఇప్పుడు రూ. 100లో రూ. 50 కోత పడనుంది.
అయితే, నెలకు రూ. 1,800లోపు పీఎఫ్ చెల్లిస్తున్న వారి జీతం తగ్గకపోవచ్చు. ఇంతకంటే ఎక్కువ చెల్లిస్తున్న వాళ్లు కావాలనుకుంటే.. తమ పీఎఫ్‌ను రూ. 1,800కి పరిమితం చేయాలని సంస్థను కోరవచ్చు.
కనీస వేతనాల మార్పుతో జీతాల పెంపు
ఈ లేబర్ కోడ్స్ నేషనల్ ఫ్లోర్ వేజ్ను కూడా తీసుకొచ్చాయి. రాష్ట్రాలు దీనికి అనుగుణంగా తమ కనీస వేతనాలను మార్చాలి. మన శ్రామికశక్తిలో దాదాపు 90 శాతం మంది రూ. 25 వేలలోపే సంపాదిస్తున్నారు. కనీస వేతనం పెరిగితే, ఈ విభాగంలోని జీతాలూ పెరుగుతాయి. కొందరు ఉద్యోగులకు పీఎఫ్ కోతలు పెరిగినా (చేతికి అందే జీతం కొద్దిగా తగ్గుతున్నా), రిటైర్మెంట్ తరువాత ఎక్కువ డబ్బు చేతికి వస్తుంది. ప్రస్తుతం ఐదేళ్ల కంటిన్యూ సర్వీసు ఉన్న వారికే గ్రాట్యుటీ చెల్లిస్తున్నారు.
ఇక నుంచి ఒక సంవత్సరం సేవ ఉన్న వారు కూడా గ్రాట్యుటీకి అర్హులు. 12 నెలలు పని చేస్తే, 15 రోజుల వేతనాన్ని గ్రాట్యుటీగా పొందవచ్చు. అసంఘటిత సాధారణ కార్మికులు మినహా దాదాపు అందరూ.. అంటే పర్మినెంట్ స్టాఫ్, ప్లాట్‌ఫారమ్, గిగ్ కార్మికులు - కొత్త లేబర్ కోడ్స్ పరిధిలోకి వస్తారు.
