పేషెంట్ల ఫోన్లు, విలువైన వస్తువులు కొట్టేస్తున్నారు

పేషెంట్ల  ఫోన్లు, విలువైన వస్తువులు కొట్టేస్తున్నారు
  • పేషెంట్ల, అటెండెంట్ల ఫోన్లు, విలువైన వస్తువులు మాయం
  • హాస్పిటల్​ సిబ్బంది పైనే అనుమానాలు
  • నిర్లక్ష్యంగా ఉంటున్న ఉన్నతాధికారులు

హైదరాబాద్, వెలుగు: పంజాగుట్ట నిమ్స్​ఆస్పత్రిలో  పేషెంట్లు, వారి అటెండెంట్ల ఫోన్లు, విలువైన వస్తువులు మాయం అవుతున్నాయి. కొంతమంది హాస్పిటల్​ సిబ్బందినే ఇలాంటివి చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరుసగా దొంగతనాలు జరుగుతుండగా చాలామంది బాధితులు బయటకు చెప్పుకోవడం లేదు.  సంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ పేషెంట్​ నిమ్స్​ఆస్పత్రిలోని మిలినియం బ్లాక్​లో ట్రీట్​మెంట్​ తీసుకుంటుండగా అతని వెంట వచ్చిన అటెండెంట్​ ఫోన్ మిస్సయ్యింది. ఎంత ఆరా తీసినా దొరక్క పోవడంతో ఆదివారం పంజాగుట్ట పోలీసులకు కంప్లయింట్​ చేశాడు. అనుమానిత వార్డు బాయ్​ను పోలీసులు విచారించగా ఫోన్ తీసినట్టు ఒప్పుకుని తిరిగి ఇచ్చాడు.  ఫోన్​లోంచి సిమ్​కార్డులు తీసివేయడంతో బాధితుడు చాలా ఇబ్బంది పడ్డాడు.
గతంలోను ఔట్ ​పేషంట్​ బ్లాక్ ​నుంచి ఇన్​ పేషెంట్​ బ్లాక్ ​దాక పేషెంట్లు, వారి బంధువులే టార్గెట్​గా బయటి నుంచి వచ్చిన వ్యక్తులు దొంగతనాలు చేసేవారు. సీసీ కెమెరాల ఆధారంగా కొంతమందిపై చర్యలు తీసుకున్నారు.  ఆ తర్వాత  దొంగతనాలు ఆగిపోయాయి. అప్పుడప్పుడు పేషెంట్ల డబ్బులు, ఫోన్లు పోతున్నా కూడా బయటకు చెప్పుకోలేకపోతుండగా ఎవరూ పట్టించుకోవడంలేదు. మళ్లీ ఇప్పుడు అలాంటి సంఘటనలే జరుగుతుండగా నిమ్స్​కి వస్తున్నవారు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.  
ఆఫీసర్ల నిర్లక్ష్యంతోనే.. 
ఆస్పత్రిలో  ఉన్నతాధికారులు డైలీ రౌండ్స్​కు వెళ్లడంలేదు. లేట్​గా వస్తూ తమ ఆఫీసుల్లోనే ఉంటూ మధ్యాహ్నం తర్వాత వెళ్లిపోతున్నట్లు పలువురు సిబ్బంది ఆరోపిస్తున్నారు.  ఆఫీసర్లు పట్టించుకోకపోవడంతోనే సిబ్బంది చోరీలకు పాల్పడుతున్నారు. సెక్యూరిటీ ఏజెన్సీలను నియమించిన తర్వాత వారి పనితీరుపై దృష్టి పెట్టడంలేదు. వరుస చోరీలపై  ఉన్నతాధికారులను వివరణ అడిగేందుకు ‘వెలుగు’ ప్రతినిధి ఆఫీసులకు వెళ్లగా ఎవరూ అందుబాటులో లేరు. కనీసం ఫోన్ చేసినా స్పందించలేదు.