- జ్వరంతో బాధపడుతూ టాబ్లెట్ వేసుకునే సమయంలో ఘటన
- ఆసుపత్రి ఎదుట కుటుంబ సభ్యులు, బంధువుల నిరసన
మిర్యాలగూడ, వెలుగు: జ్వరంతో బాధపడుతున్న యువకుడు చికిత్స కోసం ఆసుపత్రికి వస్తే అక్కడ మంచి నీరు అనుకొని యాసిడ్ ను తాగడంతో అక్కడికక్కడే చనిపోయాడు. కుటుంబసభ్యులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం అనుముల మండలం చిన్న అనుముల గ్రామానికి చెందిన సండ్ర గణేశ్ (19) హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్న గణేశ్‌ని తల్లిదండ్రులు ఇంటికి తీసుకువచ్చారు. జ్వరం తగ్గకపోవడంతో మిర్యాలగూడలోని కృష్ణ సాయి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. జ్వరం ఎక్కువగా ఉండడంతో తల్లి రామలింగమ్మ డోలో టాబ్లెట్‌ను తన కుమారుడికి ఇచ్చి మంచినీళ్ల కోసం వెళ్లింది.
హాస్పిటల్లో మంచినీళ్ల క్యాన్ పక్కనే ఒక బాటిల్లో నీళ్లు ఉన్నాయనుకొని ఆ బాటిల్ తీసుకొని తన కుమారుడికి టాబ్లెట్ వేసి అందించింది. ఆ బాటిల్ లోని నీరు తాగగానే ఆ యువకుడు వెంటనే వాంతులు చేసుకొని అక్కడికక్కడే స్పృహ తప్పి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే చికిత్స నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే గణేశ్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. దీంతో మృతి చెందిన గణేశ్ తల్లిదండ్రులు బంధువులు హాస్పిటల్ లో మంచినీళ్లు తాగే క్యాన్ వద్ద ప్రమాదకరమైన కెమికల్ ను పెట్టడం వల్లనే తన కుమారుడు చనిపోయాడని ఆరోపిస్తూ హాస్పిటల్ ఎదుట ఆందోళన చేపట్టారు. మృతి చెందిన గణేశ్ డెడ్‌బాడీని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా హాస్పిటల్ కు తరలించారు.
