ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌గఢ్ జిల్లా తమ్నార్ ప్రాంతంలో గత 15 రోజులుగా సాగుతున్న బొగ్గు గనుల వ్యతిరేక పోరాటం ఒక్కసారిగా హింసాత్మకంగా మారింది. కొత్తగా కేటాయించిన బొగ్గు బ్లాకులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ గ్రామస్తులు చేస్తున్న ఆందోళన శుక్రవారం ఉద్రిక్తతకు దారితీసింది.
సమాచారం ప్రకారం ఎం జరిగిందంటే.. తమ్నార్లోని సిహెచ్పి చౌక్ వద్ద గ్రామస్తులు గత రెండు వారాలుగా శాంతియుతంగా ధర్నా చేస్తున్నారు. అయితే, నిరసనకారులను అక్కడ నుంచి ఖాళీ చేయించడానికి పోలీసులు ప్రయత్నించడంతో గొడవ మొదలైంది. పోలీసులు బలవంతంగా తరలిస్తున్న సమయంలో ఆగ్రహం వ్యక్తం చేసిన గ్రామస్తులు పోలీసులపై రాళ్లతో దాడి చేశారు. ఈ క్రమంలో ఒక గ్రామస్తుడు రోడ్డు ప్రమాదానికి గురవ్వడంతో పరిస్థితి మరింత చేయిదాటిపోయింది.
నిరసనకారులు జరిపిన రాళ్ల దాడిలో డీఎస్పీ అనిల్ విశ్వకర్మ తలకు గాయమైంది. మహిళా ఇన్స్పెక్టర్ (TI) కమలా పుసంపై ఓ మహిళా కాలుతో తన్ని... కొందరు దాడి చేయడంతో ఆమె తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆగ్రహంతో ఉన్న నిరసనకారులు రోడ్డుపై ఉన్న ఒక బస్సును, కంపెనీకి చెందిన పలు వాహనాలను తగులబెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా పొగలతో, భయాందోళనలతో నిండిపోయింది. ఈ హింసకు సంబంధించి పోలీసులు ఇప్పటివరకు 30 నుంచి 35 మందిని అదుపులోకి తీసుకున్నారు.
కొత్త బొగ్గు గనుల వల్ల తమ ప్రాంత పర్యావరణం దెబ్బతింటుందని, తమ భూములు పోయి తాము నిరాశ్రయులవుతామని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. అందుకే ఈ ప్రాజెక్టును వెంటనే రద్దు చేయాలని, దీనిపై జరిపే ప్రజాభిప్రాయ సేకరణను (Public Hearing) ఆపేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ప్రస్తుతం ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు. జిల్లా కలెక్టర్ మయాంక్ చతుర్వేది, ఎస్పీ దివ్యాంగ్ పటేల్ అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
