టెక్నాలజీ హబ్లుగా ఐటీఐలు.. ఏటీసీలుగా అప్ గ్రేడ్ తో కొత్త రూపం

టెక్నాలజీ హబ్లుగా  ఐటీఐలు.. ఏటీసీలుగా అప్ గ్రేడ్ తో కొత్త రూపం
  • జిల్లాలో రెండు ఏటీసీలు 
  • ఆరు కోర్సుల్లో 374 మందికి శిక్షణ 
  • ఇండస్ట్రీ మిషనరీలపై రియల్ టైం ప్రాక్టికల్ ట్రైనింగ్

జయశంకర్​భూపాలపల్లి, వెలుగు : గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉపాధి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఐటీఐల రూపురేఖలను మార్చేసింది. సంప్రదాయ కోర్సులతో ఉపాధి సన్నగిల్లుతున్న క్రమంలో అధునాతన కోర్సులతో ఐటీఐలను ఏటీసీలుగా అప్ గ్రేడ్ చేసింది. ఇప్పుడున్న ఏటీసీలు గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారాయి. చదువుతోపాటు అధునాతనమైన మిషన్లపై ప్రాక్టికల్ ట్రైనింగ్ చేస్తూ కోర్సుల్లో రాణిస్తున్నారు. 

భవిష్యత్ మార్కెట్ కు అనుగుణమైన కోర్సుల్లో నైపుణ్యం పొందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు లేదా కొద్దిపాటి పెట్టుబడుతో స్వయం ఉపాధి పొందేందుకు విద్యార్థులను ట్రైనర్లుగా తీర్చిదిద్దుతున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారంలో ఏటీసీ కేంద్రాల ద్వారా విద్యార్థులకు శిక్షణ కొనసాగిస్తున్నారు. 

అధునాతన ట్రేడ్ లు..

ఇండస్ట్రియల్ 4.0 కు అనుగుణమైన ఆరు ట్రేడ్ ల్లో విద్యార్థులకు ఏటీసీల ద్వారా శిక్షణ ఇస్తున్నారు. టాటా కంపెనీ సహకారంతో గ్రూపులను ఏర్పాటు చేశారు. మాన్యుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ అండ్ ఆటోమేషన్ కోర్సు, ఇండస్ట్రియల్ రోబోటిక్స్ అండ్ డిజిటల్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నీషియన్ కోర్సు, ఇంజినీరింగ్ డిజైన్ టెక్నీషియన్ కోర్సులు ఏడాది కాల పరిమితితో పూర్తి చేసుకోవచ్చు. సీఎంసీ మ్యాచింగ్ టెక్నీషియన్ కోర్సు, మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్, వర్చువల్ అనాలసిస్ అండ్ డిజైనర్ కోర్సులు రెండేండ్లలో పూర్తికానున్నాయి. జిల్లా కేంద్రంలోని ఏటీసీలో మొదటి, రెండో సంవత్సరం రన్ అవుతుండగా, కాటారం ఏటీసీలో మొదటి సంవత్సరం మాత్రమే రన్ అవుతుంది. రెండు ఏటీసీల్లో 374 మంది విద్యార్థులు చదువుతోపాటు శిక్షణ పొందుతున్నారు.

 స్మాట్ ట్రైనింగ్..

ఏటీసీల్లో ఏర్పాటు చేసిన అధునాతనమైన పరికరాలతో విద్యార్థులు ట్రైనింగ్ పొందుతున్నారు. గత ఐటీఐల్లో  కన్వేషనర్ మిషన్స్ ఉండేవి. వీటిలో ట్రైనింగ్ కు మ్యాన్ పవర్ ఉపయోగించాల్సిన అవసరం ఉండేదని ట్రైనర్లు చెబుతున్నారు . కానీ ఇప్పుడున్న ఏటీసీల్లో స్మార్ట్ గా ట్రైనింగ్ లు ఇస్తున్నట్లుగా తెలిపారు. ఏదైనా తయారు చేయాలనుకున్నప్పుడు కావాల్సిన మ్యాన్ పవర్ లేకుండా బ్రెయిన్ పవర్ తో కంప్యూటర్ లోనే డిజైన్ చేసి సీఎంసీ (కంప్యూటర్ మెమొరీకల్ కంపెనీ )కి అనుసంధానం చేస్తే కావాల్సిన ముడి పరికరం వస్తుంది. అలాగే రోబోటిక్ వెల్డింగ్ యంత్రాలతో దుమ్ము, దూలికి దూరంగా తక్కువ సమయంలో ఎక్కువ పరికరాలను వెల్డింగ్ చేస్తూ విద్యార్థులు నిష్ణాతులను చేసేవిధంగా వర్ష్​షాపులు నిర్వహిస్తున్నారు. 

 అప్రెంటిస్ షిప్ కు ఐదుగురు విద్యార్థులు..

పని నేర్చుకోవడానికి అవకాశం లభించడంతోపాటు ఉద్యోగ నియామకాల్లో అప్రెంటిస్ షిప్ ప్రాధాన్యం పెరుగుతుంది. భూపాలపల్లి ఏటీసీ నుంచి హైదరాబాద్​లో టాటా కంపెనీ అడ్వాన్స్ సిస్టమ్ లిమిటెడ్ లో ఐదుగురు విద్యార్థులు అప్రెంటిస్ షిప్ చేస్తున్నారు. 

ఏటీసీలు విద్యార్థులకు వరం 

అధునాతన టెక్నాలజీతో రూపకల్పన చేయబడిన ఏటీసీలు విద్యార్థులకు వరం. విద్యార్థులకు చదువుతోపాటు కోర్సుల్లో నైపుణ్యం పెంచుతున్నాం. సాంకేతికపరమైన రంగాల్లో ఉపాధి కల్పించేందుకు ఏటీసీలు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. పేద విద్యార్థులకు ఉపాధి, ఉద్యోగ కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం అధునాతన కోర్సులను ప్రవేశపెట్టింది. ‌‌ - ఎల్.జుమ్లానాయక్​, ఏటీసీ ప్రిన్సిపాల్, భూపాలపల్లి 

విదేశాల్లో ఉద్యోగాలు..

తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ (టామ్ కామ్), ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్ లిమిటెడ్ లు విదేశీ ఉద్యోగాలకు దారి చూపుతున్నాయి. ఏటీసీల్లో కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు స్వదేశీ కంపెనీలతోపాటు విదేశాల్లో కూడా ఉద్యోగులుగా స్థిరపడే అవకాశం ఉంది.  

టాటా కంపెనీ అనేక అవకాశాలను అందించేందుకు సిద్ధంగా ఉంది. ఏటీసీలోని విద్యార్థులకు 19 కంపెనీలు ఎంవోఈలు తీసుకొని ఉద్యోగాలు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నాయి. ప్లేస్​మెంట్ డ్రైవ్ పెట్టి ప్రతి ఒక్కరికి ఉద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఏటీసీలు చర్యలు చేపడుతున్నాయి.