
నెట్వర్క్, వెలుగు : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పలు ప్రాంతాల్లో గురువారం అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఖమ్మం కలెక్టరేట్ లో సంబరాల్లో కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, అడిషనల్ కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. టేకులపల్లి మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయం ప్రాంగణంలో మహిళలతో కలిసి ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కనకయ్య బతుకమ్మ ఆడారు.
ఖమ్మం సిటీలోని బ్యాంకు కాలనీలోని వేడుకలకు ముఖ్య అతిథిగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు, యువ నాయకుడు తుమ్మల యుగంధర్ వచ్చి గౌరి పూజలో పాల్గొన్నారు. అనంతరం మహిళలతో కలిసి ఆటపాటలలో పాల్గొని ఉత్సాహపరిచారు. కొత్తగూడెం సింగరేణి హెడ్డాఫీస్ లో మహిళా ఉద్యోగుల బతుకమ్మలు అందరినీ ఆకట్టుకున్నాయి. భద్రాచలం ఉత్తరద్వారం వద్ద బతుకమ్మలు ఆడారు. పాల్వంచ అనుబోస్ లో సిబ్బంది, విద్యార్థినులు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు.