ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లను బురిడీకొట్టించి చోరీ 

ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లను బురిడీకొట్టించి చోరీ 
  • ఐదుగురు ఏటీఎం దొంగలు అరెస్ట్.. మరో ముగ్గురు పరార్
  • హైదరాబాద్ సీపీ అంజనికుమార్

హైదరాబాద్: దొంగలు తెలివిమీరిపోయారు. ఏకంగా ఏటీఎం మిషన్లకే బురిడీ కొట్టించి దర్జాగా డబ్బు కొల్లగొడుతున్నారు. ఐదుగురు సభ్యుల అంతర్ రాష్ట్ర ఘరానా దొంగల ముఠాను హదరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేశారు. నిందితులను మంగళవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టిన హైదరాబాద్ సీపీ అంజనికుమార్ దొంగలు చోరీ చేస్తున్న విధానాన్ని వెల్లడించారు. 
సౌత్ జోన్ పోలీస్ ఆధ్వర్యంలో హర్యానాకు చెందిన అంతర్ రాష్ట్ర దొంగల ముఠాలో 8 మంది దొంగలకు గాను ఐదుగురుని పట్టుకున్నామని సీపీ అంజని కుమార్ తెలిపారు. సీసీ కెమెరాల ఆధారంగా దొంగలను గుర్తించామని, ముగ్గురు పరారీలో ఉన్నారని వివరించారు. నిందితులు సిటీలోని హుస్సేని ఆలం ఎస్.బి.ఐ  బ్రాంచ్ ఏటీఎంలో చోరీ చేశారని, నిందితుల నుండి 2 బైకులు, 3 ఆటోలు, 5 మొబైల్ ఫోన్లు, 11 ఏటీఎం కార్డులు, 2 వేల నగదు స్వాధీనం చేసుకున్నామని  తెలిపారు. నిందితులు రెండేళ్లుగా సొంత రాష్ట్రం దాటి బయటకు వచ్చి తెలివిగా చోరీలు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. స్టేట్ బ్యాంకు ఏటీఎం లో చోరీ చేసేటప్పుడు  వేరే బ్యాంకు కార్డ్స్ వాడతారని తెలిపారు. 
నిందితుల దగ్గర ఆక్సిస్ బ్యాంకు, బరోడా, ఐసీఐసీఐ బ్యాంకులకు చెందిన అన్నిరకాల కార్డులు ఉన్నాయన్నారు. చోరీ సమయంలో స్టేట్ బ్యాంక్ కార్డులు కాకుండా ఇతర కార్డులు వాడతారని, పట్టుపడకుండా చోరీ చేసిన విధానాన్ని వివరించారు. 
ఏటీఎం క్యాష్ డిపాజిట్ మిషన్లకు బురిడీకొట్టిస్తున్నారు ఇలా..
నార్మల్ విత్ డ్రా లాగానే కాష్ బయటకు వచ్చేటపుడు పవర్ బట్టన్ ఆఫ్ చేస్తారు.
కాష్ బయటకు రాగానే కాష్ తీసుకుంటారు.
వేరే బ్యాంకు కార్డ్స్ కాబట్టి అకౌంట్ లో మాత్రం ఎర్రర్ అని వస్తుంది.
స్టేట్ బ్యాంక్ వాళ్లకు, యూస్ చేసిన కార్డు  బ్యాంకు వాళ్లకు మధ్య ప్రాసెస్ జరగడానికి 5 నుండి వారం రోజుల సమయం పడుతుంది. 
డబ్బులు రాలేదని మళ్లీ బ్యాంకుకు వెళ్లి కంప్లయింట్ చేస్తారు.
బ్యాంకు వాళ్ల దగ్గర నుండి రికవరీ చేసుకుంటున్నారు.
ఇలా రెండేళ్లుగా ఇతర రాష్ట్రాలకు వచ్చి చోరీలు చేస్తున్నారు. నిందితులందరూ హర్యానా రాష్ట్రానికి చెందిన వారిగా గుర్తించారు. హైదరాబాద్ నగరానికి వచ్చిన ఈ ముఠా సభ్యులు వారం రోజుల క్రితం నుండి ఇలా చోరీలు చేస్తూ పట్టుబడ్డారు. మరో కేసులో వరుస దొంగతనాలకు పాల్పడుతున్న ఒక ఫ్యామిలీ ని అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నామని హైదరాబాద్ సీపీ అంజని కుమార్ తెలిపారు.