ఢాకా: మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వంపై ఆ దేశ మాజీ ప్రధాని, అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. యూనస్ పరిపాలన దేశాన్ని హంతక అరాచకంలోకి నెట్టిందని.. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్యం రక్తంతో తడిసిపోయిందని హాట్ కామెంట్స్ చేశారు. యూనస్ చట్టవిరుద్ధమైన, హింసాత్మక పాలనతో దేశం చీకటి యుగంలోకి పయనిస్తోందని ఆరోపించారు. యూనస్ ఒక హంతక ఫాసిస్ట్, వడ్డీ వ్యాపారి, డబ్బు అక్రమంగా తరలించేవాడు, అధికార దాహం గల దేశద్రోహి అని అభవర్ణించారు.
శుక్రవారం (జనవరి 23) సేవ్ డెమోక్రసీ ఇన్ బంగ్లాదేశ్ పేరుతో ఢిల్లీలోని ఫారిన్ కరస్పాండెంట్స్ క్లబ్‌లో ఓ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి హసీనా అవామీ లీగ్ ప్రభుత్వానికి చెందిన పలువురు మాజీ మంత్రులు, బంగ్లాదేశ్ ప్రవాసులు హాజరయ్యారు. హసీనా వర్చువల్‌గా ప్రేక్షకులను ఉద్దేశించి మాట్లాడారు. ఒకప్పుడు శాంతియుత, సారవంతమైన దేశంగా ఉన్న బంగ్లాదేశ్ ఇప్పుడు తీవ్ర హింస, భయం, విధ్వంసాన్ని ఎదుర్కొంటోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కుట్ర చేసి 2024, ఆగస్టు 5న తనను బలవంతంగా పదవి నుంచి తొలగించారని.. ఆ రోజు నుంచి బంగ్లా భయానక యుగంలోకి నెట్టబడిందని.. దేశంలో ప్రజాస్వామ్యం చచ్చిపోయిందని పేర్కొన్నారు. పత్రికా స్వేచ్ఛ అణచివేయబడింది. మానవ హక్కులు తుంగలో తొక్కాబడ్డాయని విమర్శించారు. దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు కుప్పకూలిపోతుండటంతో మైనారిటీలు, మహిళలు, పిల్లలు బతుకు దుర్బలంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
►ALSO READ | అమెరికా టారిఫ్‌లపై కనీసం నోరెత్తరు: మోడీ సర్కార్‌పై రాహుల్ గాంధీ ఫైర్
అల్లర్లు, హత్యలు, దహనం, దోపిడీలు, బలవంతపు వసూళ్లు రాజధాని నుంచి గ్రామీణ ప్రాంతాలకు వ్యాపించాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో విద్యా వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారిందన్నారు. దేశ భూమి, వనరులపై నియంత్రణ సాధించడానికి విదేశీ శక్తులు సంక్షోభాన్ని ఉపయోగించుకుంటున్నాయని పరోక్షంగా పాకిస్తాన్‌ను విమర్శించారు. ఒక హంతక, ఫాసిస్ట్ ముఠా ఇప్పుడు దేశాన్ని రక్తసిక్తం చేస్తోందని మండిపడ్డారు.
బంగ్లాదేశ్‌ను ఇప్పుడు ఒక విశాలమైన జైలు, ఉరిశిక్షలకు నిలయంగా మార్చేశారని నిప్పులు చెరిగారు. మన మాతృభూమి ఆత్మ కళంకితమైందని.. రాజ్యాంగాన్ని రక్షించి దేశంలో ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించాలని బంగ్లా పౌరులకు పిలుపునిచ్చారు. 1971 బంగ్లాదేశ్ విముక్తి యుద్ధ స్ఫూర్తితో దేశ ప్రజలు తమ సార్వభౌమత్వాన్ని తిరిగి పొందాలని విజ్ఞప్తి చేశారు. తన పార్టీ అవామీ లీగ్ పోటీ చేయకుండా నిషేధం కొనసాగితే 2026, ఫిబ్రవరి 12న జరిగే బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ సంక్షోభం తలెత్తే అవకాశం ఉందని ఆమె హెచ్చరించారు.
