మీ కార్డులో డబ్బులు ఉంటాయ్.. ATMలోనే ఉండవ్.. ATM సెంటర్లు మూతబడుతున్నాయా..?

మీ కార్డులో డబ్బులు ఉంటాయ్.. ATMలోనే ఉండవ్.. ATM సెంటర్లు మూతబడుతున్నాయా..?

దేశవ్యాప్తంగా ఏటీఎం సెంటర్లు నగదు కొరత కారణంగా మూతపడే ప్రమాదం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ హెచ్చరించింది. బ్యాంకుల నుంచి నగదు తీసుకోవడంలో ఏటీఎం ఆపరేటర్లు ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని క్యాట్మీ (CATMi) ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్ (IBA)కు ఇప్పటికే లేఖ రాసింది. ఈ విషయాన్ని.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కరెన్సీ మేనేజ్‌మెంట్ విభాగానికి కూడా తెలియజేశారు.

ఈ కారణంగా దేశంలో ఏటీఎం సేవలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఏటీఎం ఇండస్ట్రీ (CATMi) తెలిపింది. ఈ ప్రభావం పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఉండే డెబిట్ కార్డ్ వినియోగదారులపై ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. మార్చి, ఏప్రిల్ నెలల్లో ఏటీఎం ఆపరేటర్లకు దేశవ్యాప్తంగా ఉన్న ఏటీఎంల్లో నగదు లోడింగ్ కోసం సుమారు నెలకు రూ. 94 వేల కోట్లు అవసరం పడ్డాయి. అయితే.. మార్చిలో రూ. 61 వేల కోట్లు, ఏప్రిల్లో రూ. 54 వేల కోట్లు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. దీని ఫలితంగా.. నగదు లభ్యత స్థాయి అవసరాల కంటే చాలా దారుణంగా పడిపోయింది.

ఇలా.. నగదు కొరతతో పాటు, పెరుగుతున్న ఇంధన ధరలు, లావాదేవీల పరిమాణంలో తీవ్ర క్షీణత కారణంగా ఏటీఎం ఆపరేటర్లు తీవ్ర ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు డిజిటల్ చెల్లింపులకే మొగ్గు చూపుతున్నారు. దీంతో.. ఏటీఎంల వాడకం ఊహించిన దానికంటే గణనీయంగా తగ్గింది.

కరెన్సీ చలామణిలో వృద్ధి కొనసాగుతున్నప్పటికీ.. గత ఏడాది కాలంలో ఏటీఎం లావాదేవీలు గణనీయంగా తగ్గాయని రిజర్వ్ బ్యాంక్ డేటా స్పష్టం చేసింది. నగదు సరఫరా సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే.. అనేక ప్రాంతాలలో ఏటీఎంల్లో నగదు దొరకకపోవచ్చని.. లక్షలాది మంది వినియోగదారులపై ఈ ప్రభావం పడుతుందని క్యాట్మీ (CATMi) హెచ్చరించింది.