బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ. ప్రయాణం

బిడ్డ మృతదేహంతో స్కూటీపై 120 కి.మీ. ప్రయాణం

ప్రభుత్వాలు ఎన్ని మాటలు చెబుతున్నా.. గవర్నమెంట్ ఆస్పత్రుల పరిస్థితి మాత్రం ఇంకా దయనీయంగానే ఉంది. ఒక చోట్ల సిబ్బంది కొరత ఉంటే.. మరోచోట వైద్యానికి అవసరమైన మందులు అందుబాటులో ఉండవు. ఇంకొన్ని చోట్ల పేషంట్లను తీసుకువెళ్లేందుకు అంబులెన్సులు కూడా ఉండని పరిస్థితి. పెద్దాసుపత్రుల్లో సైతం ఎవరైనా చికిత్స పొందుతూ చనిపోయినా.. ఆ మృతదేహాన్ని ఇంటికి తీసుకువెళ్లేందుకు కూడా నానా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాంటి ఘటనే విశాఖ కేజీహెచ్ ఆస్పత్రిలో జరిగింది. చంటిబిడ్డ మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సిబ్బంది అంబులెన్స్ ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులు స్కూటీపైనే శవంతో 120 కిలోమీటర్ల ప్రయాణించాల్సి  వచ్చింది. 

అల్లూరు సీతారామరాజు జిల్లా ముంచింగిపుట్టు మండలానికి చెందిన దంపతులు తమ బిడ్డకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో విశాఖ కేజీహెచ్ లో అడ్మిట్ చేశారు. పరిస్థితి విషమించడంతో ఆ చిన్నారి కన్నుమూసింది. కడుపుకోతతో పుట్టెడు దుఖంలో ఉన్న తల్లిదండ్రులు బిడ్డ మృతదేహం తీసుకెళ్లేందుకు అంబులెన్స్ ఇవ్వాలని కేజీహెచ్ సిబ్బందిని కోరారు. ఎంత ప్రాధేయపడినా వారు కనికరించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో వారు చంటిబిడ్డ మృతదేహాన్ని తీసుకుని స్కూటీపై ఇంటిదారి పట్టారు. అలా 120 కిలోమీటర్లు ప్రయాణించి బిడ్డ శవంతో ఇంటికి చేరుకున్నారు. కేజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే తమ బిడ్డ ప్రాణాలు పోయానని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంబులెన్స్ ఇవ్వని స్టాఫ్ పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.