మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి​పై అట్రాసిటీ కేసు

మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి​పై అట్రాసిటీ కేసు
  •     మరో ముగ్గురు ఉన్నతాధికారులు, మాజీ ఎమ్మెల్యే కొడుకుపైనా..
  •     ఇబ్రహీపట్నం మున్సిపల్ చైర్​పర్సన్ ఫిర్యాదుతో కేసు ఫైల్ చేసిన పోలీసులు

ఎల్​బీనగర్,వెలుగు :  ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్​కుమార్​పై అట్రాసిటీ కేసు నమోదైంది.  ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్ పర్సన్ కప్పరి స్రవంతి ఫిర్యాదుతో స్థానిక పీఎస్  పోలీసులు కోర్టు రిఫర్ కేసుగా నమోదు చేశారు. 2019 జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పదవి  కోసం అప్పటి ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అతని కొడుకు ప్రశాంత్ రెడ్డి తన రూ.2.50 కోట్లు తీసుకున్నారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు.

తమ మామ ఇబ్రహీంపట్నం మాజీ సర్పంచ్ కావడంతో ఆయన ప్రభావం ఎన్నికల్లో ఉండడంతో చైర్ పర్సన్ స్థానాన్ని డబ్బులు తీసుకొని ఇచ్చారని, అదేవిధంగా ఎన్నికైన నాటి నుంచి తనను కులం పేరుతో వేధిస్తున్నారని ఆమె ఆరోపించారు. పలు సమావేశాల్లో తనకు ప్రోటోకాల్ మర్యాద కూడా ఇవ్వకుండా మాట్లాడారని, వైస్ చైర్మన్​కు బాధ్యతలు ఇచ్చే ప్రయత్నం చేశారని, తరచూ సెలవు పెట్టమని వారు బెదిరించారని పేర్కొన్నారు.

అప్పటి కలెక్టర్ సైతం ఉన్నత కులం వారితో గొడవ పెట్టుకోవద్దని చెప్పారని స్రవంతి ఆవేదనం వ్యక్తం చేశారు. దీంతో మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డితో పాటు ఆయన కొడుకు ప్రశాంత్ రెడ్డి, రంగారెడ్డి జిల్లా పూర్వ కలెక్టర్ అమోయ్ కుమార్, మాజీ మున్సిపల్ కమిషనర్ యూసఫ్​పై అట్రాసిటీ కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.