బర్రెలక్క ప్రచారంపై దాడి .. ఆమె తమ్ముడికి గాయాలు

బర్రెలక్క ప్రచారంపై దాడి .. ఆమె తమ్ముడికి గాయాలు
  • కన్నీరు పెట్టుకున్న శిరీష
  • మద్దతుగా నిలుస్తామని పోస్టులు

కొల్లాపూర్, వెలుగు :  తెలంగాణ నిరుద్యోగుల గొంతుకగా కొల్లాపూర్ ​నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలో నిలిచిన శిరీష అలియాస్​ బర్రెలక్క మంగళవారం సాయంత్రం నాగర్​కర్నూల్​ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో ప్రచారం చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. ఈ అటాక్​లో ఆమె తమ్ముడికి గాయాలయ్యాయి. తనపై కోపం తన తమ్ముడిపై చూపడం ఏమిటని శిరీష కన్నీరుమున్నీరయ్యారు. దీనిపై పెద్దకొత్తపల్లి పోలీస్​స్టేషన్​లో కంప్లయింట్​ ఇచ్చారు.

తనకు రక్షణ కల్పించాలని వేడుకున్నారు. దాడి సోషల్​ మీడియాలో వైరల్​కావడంతో పలువురు నెటిజన్లు ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు. తెలంగాణలో ఏండ్ల తరబడి కోచింగ్ తీసుకుని చదివినా జాబ్‌లు రావడం లేదని, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే బదులు బర్రెలు కాయడం బెటర్ అనుకున్నా అంటూ శిరీష కొంతకాలం కింద బర్రెలక్కగా సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరలైంది. నిరుద్యోగుల గొంతుకనవుతానంటూ ఈ అసెంబ్లీ ఎన్నికల్లో కొల్లాపూర్ ​నుంచి ఇండిపెండెంట్​గా బరిలోకి దిగారు.

పోలింగ్ తేదీ సమీపిస్తుండడంతో శిరీష నియోజకవర్గంలో జోరుగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మంగళవారం కొల్లాపూర్ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్లలో ప్రచారానికి వచ్చారు. ఈ సందర్భంగా గుర్తు తెలియని వ్యక్తులు అకస్మాత్తుగా దాడికి దిగారు. ఈ ఘటనలో ఆమె తమ్ముడు గాయపడ్డాడు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాడితో కలత చెందిన బర్రెలక్క కన్నీరు పెట్టుకున్నారు. 

భయంతోనే దాడి 

దాడి తర్వాత బర్రెలక్క మాట్లాడుతూ  తాను గెలుస్తాననే భయంతోనే దాడి చేశారని ఆరోపించారు. తనపై దాడి చేసింది ఏ పార్టీ వారో తెలియదని, రాజకీయాలు అంటేనే రౌడీయిజం అంటారని, తాను ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానన్నారు. అయినా భయపడేది లేదన్నారు. నిరుద్యోగుల కోసం పోరాడడానికి వచ్చినందుకే దాడులు చేస్తున్నారన్నారు. ఇప్పటి వరకు  ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా ఎవరి పేరు బయటపెట్టలేదన్నారు. పోలీసులు రక్షణ కల్పించాలని కోరారు.