స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్​పై దాడి

స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి అశోక్ కుమార్​పై దాడి
  •      నల్గొండ జిల్లా నార్కట్​పల్లిలో ఘటన

నార్కట్​పల్లి, వెలుగు : నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల స్వతంత్ర అభ్యర్థి అశోక్ కుమార్​పై కొందరు నాయకులు దాడి చేశారు. ఈ ఘటనపై ఆయన నిరసన వ్యక్తం చేశారు. సోమవారం నల్గొండ జిల్లా నార్కట్​పల్లి పట్టణంలోని ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని అశోక్ కుమార్ పరిశీలించారు. ఈ సందర్భంగా నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నారనే సమాచారంతో స్థానిక డోకూరి గార్డెన్​కు వెళ్లారు. 

అక్కడున్న నాయకులు దాడి చేయడంతో ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయన స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో తనకు న్యాయం జరిగే వరకు  ఇక్కడ నుంచి వెళ్లనని స్టేషన్ ముందు నిరసన వ్యక్తం చేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడారు. తనపై దాడి చేసిన వారిపై ఫిర్యాదు చేస్తే పోలీసులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. 

ఈ ఘటనపై 100​కు కాల్ చేసి ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశా నని వెల్లడించారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ నేపథ్యంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, సీఐ నాగరాజు పోలీస్ స్టేషన్​కు వచ్చి అశోక్ కుమార్​తో మాట్లాడారు. న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. దీంతో ఆయన నిరసన విరమించారు.