ఎంపీపై దాడి ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించాలి : చెరుకు శ్రీనివాస్​ రెడ్డి

ఎంపీపై దాడి ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించాలి : చెరుకు శ్రీనివాస్​ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: ఎంపీ కొత్త ప్రభాకర్​ రెడ్డిపై దాడి ఘటనను సీబీఐతో దర్యాప్తు చేయించాలని దుబ్బాక కాంగ్రెస్​ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్​ రెడ్డి డిమాండ్​ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ విచారణపై నమ్మకం లేదని స్పష్టం చేశారు. ప్రభాకర్​ రెడ్డిపై దాడిని ఖండిస్తున్నామన్నారు. అయితే, ఆ దాడి చేసింది కాంగ్రెస్​ కార్యకర్త అని అనడం కరెక్ట్​ కాదని, 2018, 2019 నాటి పాత ఫొటోలను చూపించి తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. దాడి చేయించింది కాంగ్రెసేనంటూ ఘటన జరిగిన గంటలోనే సీఎం కేసీఆర్​ అనడం ఏంటని ఫైర్​ అయ్యారు. నిందితుడి కాల్​ డేటాను వెరిఫై చేస్తున్నట్టు సిద్దిపేట ఎస్పీ చెప్తున్నారని, అయినా ముందుగానే కేసీఆర్​ తప్పుడు ప్రకటన చేశారని మండిపడ్డారు.

మంగళవారం ఆయన పీసీసీ అధికార ప్రతినిధి సామ రామ్మోహన్​ రెడ్డితో కలిసి గాంధీభవన్​లో మీడియాతో మాట్లాడారు. దాడిని బీఆర్​ఎస్​ లీడర్లు సానుభూతి కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. ప్రభాకర్​ రెడ్డిని దగ్గర్లోని కార్పొరేట్​ ఆస్పత్రికి కాకుండా బీఆర్ఎస్​కు అనుకూల యశోద ఆస్పత్రికి తీసుకెళ్లడం అనుమానాలకు తావిస్తున్నదన్నారు. కోడ్​ అమలులో ఉన్నప్పుడు సిద్దిపేటలో ఎట్లా బంద్​ నిర్వహిస్తారని ప్రశ్నించారు. ప్రభాకర్​ రెడ్డిపై దాడి కాంగ్రెస్​ పనేనంటూ కేసీఆర్​ బట్ట కాల్చి మీద వేస్తున్నారని రామ్మోహన్​ రెడ్డి విమర్శించారు.