తీన్మార్​ మల్లన్నపై దాడి

తీన్మార్​ మల్లన్నపై దాడి
  • ఆఫీసులో చొరబడ్డ 20 మంది
  • ఫర్నిచర్​, కంప్యూటర్లు ధ్వంసం 
  • ఇది టీఆర్​ఎస్​ గూండాల పనే: మల్లన్న

హైదరాబాద్, వెలుగు: తీన్మార్ మల్లన్నపై దాడి జరిగింది. శుక్రవారం రాత్రి ‘శనార్తి తెలంగాణ’ ఆఫీసులోకి సుమారు 20 మంది చొరబడి మల్లన్నతో వాగ్వాదానికి దిగారు. ఆఫీసులోని ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. మల్లన్నపై చేయి చేసుకున్నారు. దాడికి పాల్పడింది టీఆర్ఎస్ గూండాలేనని మల్లన్న ఆరోపించారు. ‘అభివృద్ధి ఎక్కడ జరిగింది?’ అంటూ శుక్రవారం శనార్తి తెలంగాణ, క్యూ న్యూస్ లో ఆన్​లైన్​ పోలింగ్​ పెట్టారు. దీన్ని కేటీఆర్​ ట్వీట్​ చేస్తూ.. నిస్సిగ్గుగా ఎదుటివారిపై బురద జల్లుతున్నారని మండిపడ్డారు. కేటీఆర్​ ట్వీట్​ చేసిన తర్వాతే తన ఆఫీసుపై దాడి జరిగిందని, పథకం ప్రకారమే దాడులు చేస్తున్నారని మల్లన్న అన్నారు. కేటీఆర్ మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడికి సంబంధించిన విజువల్స్ సీసీటీవీ కెమెరాల్లో రికార్డయ్యాయని చెప్పారు. దాడి చేసిన వాళ్లను గుర్తించి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక పోలీసులకు సమాచారం అందించినా ఎవ్వరూ స్పందించలేదని మల్లన్న అన్నారు