
కూకట్పల్లి, వెలుగు: కిరాణా షాపులో తీసుకున్న సరుకుల అప్పు తీర్చమని అడిగిన మహిళపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. కేపీహెచ్బీ పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్బీ కాలనీ ఏడో ఫేజ్లో మణిమాల(38) అనే మహిళ కిరాణా షాపు నడుపుతోంది. ఇదే కాలనీలో నివాసముంటున్న రాజేశ్రెడ్డి రూ.7,500 విలువైన సామగ్రి అప్పుగా తీసుకున్నాడు. బాకీ తీర్చాలని బుధవారం ఆయనను మణిమాల నిలదీసింది. దీంతో ఇంటికి వెళ్లి తన వెంట కత్తి తెచ్చుకున్న రాజేశ్రెడ్డి.. మధ్యాహ్నం మణిమాల ఇంటికి వెళ్లాడు. ఆమె మెడపై పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికులు ఆమెను ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.