
తొలకరి కురిస్తే రైతు ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది. చినుకుల సవ్వడి వింటుంటే మనసు సంతోషంతో ఉప్పొగుంతుంది. ఆకాశం నుంచి ధారగా కురుస్తున్న వర్షాన్ని చూస్తే ఆ వానలో తడవాలని కోరిక పుడుతుంది. ఈ భూమ్మీద జీవరాశులన్నీ సంబరపడే క్షణం వాన కురిసే వేళ. సమస్త జీవరాశుల ఉనికికి వాన కూడా ప్రధాన వనరు. అందుకే మనదేశంలో వరుణ దేవుడ్ని ఆరాధిస్తాం. వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా అయితే అతి వృష్టి లేదా అనా వృష్టి సంభవించే రోజుల్లోకి వచ్చాం. అందుకే తక్షణమే సమస్త మానవాళి మేల్కొని ప్రకృతి పరిరక్షణలో భాగమవ్వాలి అని గుర్తుచేస్తున్నాయి నేటి పరిస్థితులు. వర్షపు జల్లులు కాస్త జడివానగా మారుతున్నాయి. తుఫాన్లు, వరదలు అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి. ఇవే అనుకుంటే.. చాలా అరుదుగా జరిగే మేఘ విస్ఫోటనాలు తరుచుగా జరుగుతున్నాయి. ఇవన్నీ దేనికి సంకేతం? ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారంటే..
సాధారణంగా గాలిలో రెండు రకాలుంటాయి. చల్లగాలి, వేడిగాలి అని. అయితే వేడిగాలి తేలికగా ఉండి పైకి వెళ్తుంది. చల్లగాలి నీటి తేమ కారణంగా భూమి ఉపరితలం మీదకు చేరుతుంది. సముద్ర ఉపరితం వేడెక్కడం వల్ల చల్లగాలిలో ఉండే తేమ తేలికైన ఆవిరిగా మారి పైకి చేరుతుంది. గాలిలో ఉండే నీటి ఆవిరి కూడా ఘనీభవించి నీటి స్ఫటికాల్లా మారతాయి. అవన్నీ కలిసి దట్టమైన మేఘాలుగా ఏర్పడతాయి. ఎక్కువ మొత్తంలో గాలులు పైకి చేరడం వల్ల భూ ఉపరితలం మీద ఖాళీ ఏర్పడుతుంది. దీన్నే అల్పపీడనం అంటారు. చుట్టూ వీచే గాలులు అల్పపీడనం వైపు వెళ్తాయి. ఆ గాలులతోపాటే మేఘాలు కూడా కదులుతూ చల్లగా మారి వర్షంగా కురుస్తాయి. తీవ్రత ఎక్కువగా ఉంటే ఆ గాలుల అల్పపీడన ప్రాంతంలో వేగంగా, గుండ్రంగా తిరుగుతాయి. అల్పపీడనం ఇంకా బలపడితే.. వాయుగుండంగా మారుతుంది. అంతకంటే ఎక్కువ తీవ్రత ఉంటే తుఫాన్‌లా మారుతుంది. అయితే సముద్రాల్లో అల్పపీడనం ఏర్పడటం సర్వ సాధారణం. కానీ, ఈ మధ్య వెంటవెంటనే ఏర్పడటం, కుండపోత వానలు కురవడం అసహజంగా కనిపిస్తోంది.
వాళ్లు మాత్రం సేఫ్!
చిరపుంజి లాంటి ప్రాంతాల్లో ఏడాదంతా వానలు కురుస్తాయి. అక్కడ ఎన్నోసార్లు క్లౌడ్ బరస్ట్‌లు జరిగాయి. కానీ, ఎప్పుడూ పెద్ద నష్టం జరగలేదు. అందుకు కారణం అక్కడి వాతావరణ పరిస్థితులను ప్రజలు ముందుగానే పసిగట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం. నీరు ఒకచోట ఉండకుండా ప్రవహిస్తూ ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి ప్రమాదం ఎటు వైపు నుంచి వస్తుందో వాళ్లు గుర్తిస్తారు. తద్వారా అక్కడి నివాసాలు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్తారు. అందుకే అక్కడి ప్రజలు సేఫ్‌గా ఉంటారు. అయితే ఈ పరిస్థితిని ముందే వాతావరణ శాఖ అంచనా వేసి చెప్పగలదా? అంటే.. అసాధ్యం. ఎందుకంటే విశాలమైన ప్రాంతాల్లో వర్షపాతాన్ని అంచనా వేయగలిగినంత ఈజీగా క్లౌడ్ బరస్ట్ని కనుక్కోవడం సాధ్యం కాదని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు.
తెలంగాణలో..
కామారెడ్డి, నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లాలు భౌగోళికంగా ఎత్తయిన ప్రదేశంలో ఉన్నాయి. అందుకే అక్కడ వర్షాలు ఎక్కువగా కురుస్తున్నాయి. వాతావరణ మార్పుల వల్ల మేఘాలు ఒకేచోట ఎక్కువసేపు ఉండి అక్కడే ఎక్కువ మొత్తంలో వర్షాన్ని కురిపిస్తున్నాయి. మాన్సూన్ సీజన్ మార్పుల వల్ల కొన్ని చోట్ల ఎక్కువ వర్షపాతం నమోదవుతోంది. మొన్న మెదక్, కామారెడ్డిల్లో కురిసిన వర్షాన్ని వాతావరణ శాఖ అంచనా వేసింది. కానీ, ఉపద్రవాన్ని గుర్తించలేకపోయింది. అసాధారణ వాతావరణ మార్పులను కూడా అంచనా వేసే టెక్నాలజీ వాడాల్సిన అవసరం ఉంది. అప్పుడే ప్రాణ నష్టం జరగకుండా కాపాడొచ్చు. హఠాత్తుగా సంభవించే వాతావరణ మార్పులను గుర్తించడం కష్టం. రాత్రి సమయంలో అయితే గుర్తించినా ప్రజల్ని అప్రమత్తం చేసే చాన్స్ చాలా తక్కువ.
నష్టాలు
ప్రస్తుతం పట్టణాలు, సిటీల్లోభారీ వర్షాలు తరచూ రావడంవల్ల ఆర్థిక, ప్రాణ నష్టాలు జరుగుతు న్నాయి. పంట నష్టం, సారవంతమైన, ఖనిజ నేలలు కోతకు గురవడం, డ్యామ్‌లు కూలిపోవడం, ఊళ్లకు ఊళ్లు తుడిచిపెట్టుకుపోవడం వంటివి జరుగుతున్నాయి.తద్వారా అన్నిరకాలుగా డెవలప్మెంట్ ఆగిపోతుంది.
సిటీల్లో ఎందుకు ?
బెంగళూరు, చెన్నై, ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ వంటి నగరాల్లో ఈ మధ్య తరచూ విపరీతమైన వానలు చూస్తున్నాం. ఈ నగరాల్లో సాధారణంగా వేడి ఎక్కువగా ఉండడం వల్ల మధ్యాహ్నం మూడు గంటల తర్వాత భారీ వర్షాలు కురుస్తుంటాయి. నగరాల్లో ఇలా జరగడానికి కారణం పారిశ్రామికీకరణ, సిటీల విస్తీర్ణం పెరగడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్స్ నుంచి వెలువడే పొగ, వాతావరణంలో వేడిమి, అధిక జనాభా వల్ల కాలుష్యం పెరుగుతుంది. దాంతో భూతాపం పెరిగి వాతావరణంలో మార్పులు వస్తున్నాయి.
భూమి చదునుగా ఉండడంతో బంగాళాఖాతంలో ఏర్పడే తుఫానులు తీరం వైపుకు వస్తున్నాయి. గాలిలో తేమ పెరగడం, దానికి రుతుపవనాలు తోడు కావడంతో వర్షాలు బాగా కురుస్తున్నాయి. అయితే ఒక ప్రాంతంలో ఎక్కువగా మరోప్రాంతంలో తక్కువగా వర్షపాతం నమోదు అవుతుంటుంది. టెంపరేచర్‌తో పాటు గాలులు వీచే దిశను బట్టి వర్షం ఎక్కువ లేదా తక్కువగా కురుస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఈ మధ్య తరచూ చూస్తున్నాం. ఈ మధ్య అల్ప పీడన గమనం కూడా మారుతోంది. దాంతో ఒకచోట కురవాల్సిన వాన మరోచోట కురుస్తోంది.
క్లౌడ్ బరస్ట్ అంటే..
వాతావరణ శాస్త్ర ప్రకారం ఒక చదరపు కిలోమీటర్ నుంచి పది కిలో మీటర్లలోపు విస్తీర్ణంలో గంటలో పది సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ వర్షం కురిస్తే.. దాన్నే మేఘ విస్ఫోటనం (క్లౌడ్ బరస్ట్) అంటారు. ఇవి ఎక్కువగా పర్వత ప్రాంతాలు లేదా ఎత్తైన ప్రదేశాల్లో జరుగుతుంటాయి. ఒక్కోసారి ఒకే ప్రాంతంలో ఎక్కువసార్లు కూడా క్లౌడ్ బరస్ట్ జరగొచ్చు. ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బరస్ట్‌లు జరగడం చూస్తున్నాం. భారతదేశంలో అయితే హిమాలయాల్లో ఎక్కువగా మాన్సూన్లో వస్తుంటాయి.
హిమాలయాల్లో వేడి వాతావరణం వల్ల కిందకి పడాల్సిన వర్షపు చినుకులు తిరిగి పైకి వెళ్తాయి. అవే ఒక్కసారిగా వర్షంలా కురుస్తాయి. రుతుపవనాలు దేశంలోకి ప్రవేశించినప్పుడు అరేబియా సముద్రం నుంచి తేమతో కూడిన గాలులు వీస్తాయి. మధ్యదరా తీరం నుంచి వీస్తున్న గాలులు పశ్చిమాన తేమని తీసుకొస్తుంటాయి. ఈ రెండు గాలులు ఒకదానినొకటి ఢీ కొన్నప్పుడు ఏర్పడిన మేఘాలు ఎక్కువ సాంద్రతను కలిగి ఉంటాయి. అవి ఒక్కసారిగా వర్షంలా మారడంతో క్లౌడ్ బరస్ట్ ఏర్పడుతుంది. హిమాచల్, ఉత్తరాఖండ్, జమ్మూ కశ్మీర్లో సాధారణం. గ్లోబల్ వార్మింగ్ పెరిగేకొద్దీ ఇలాంటివి ఇంకా ఎక్కువ అవుతాయి.
మనిషే కారణమా ?
అడవులను నరికివేయడం, పర్వత ప్రాంతాల్లో సమతౌల్యత దెబ్బ తినడం ముఖ్య కారణాలు. వీటి వల్లే వాతావరణ మార్పులు వస్తున్నాయి. దీనికి పరిష్కారం ప్రకృతిని రక్షించుకోవడమే. పచ్చదనంపై దృష్టిసారించాలి. కాలుష్యాన్ని తగ్గించే దిశగా అడుగులు పడాలి. అందరి భాగస్వామ్యం ఉంటేనే ప్రకృతి విపత్తులను అరికట్టగలం. ఒక దేశం కాదు.. ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన క్షణం ఇది. గ్రామాల నుంచి సిటీల వరకు అందరూ బాధ్యత తీసుకోవాలి.
ఇప్పుడు వాతావరణంలో ఉన్న కార్బన్ డయాక్సైడ్ను సగానికి తగ్గించకపోతే ముందున్న తరాలు కరువును ఎదుర్కోవాల్సి వస్తుంది. రాబోయే తరానికి వనరులన్నీ సమృద్ధిగా అందించాలంటే వాటిని కాపాడాలి. అందుకోసం స్కూల్ లెవల్ నుంచి వాతావరణ మార్పులు, నివారణ చర్యలు వంటివి నేర్పాలి. ఇప్పటికే మనిషి వల్ల ప్రకృతికి జరగకూడని నష్టం జరిగింది. రాబోయే తరాలు సుఖంగా జీవించాలంటే మార్పు ఈ తరం నుంచే మొదలవ్వాలి.
గంటలో కురిసింది కాదు
క్లౌడ్ బరస్ట్ ఎత్తైన ప్రాంతాల్లోనే జరుగుతుంది. కానీ, తెలంగాణ దక్కన్ పీఠభూమిలో భాగం. ఇక్కడ అలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉండదు. మొన్న పడిన వర్షం కూడా ఒక్క గంటలో కురిసింది కాదు. నాలుగు గంటల్లో కురిసిన వర్షం. వీటిని మోడరేట్ స్పెల్స్, హెవీ స్పెల్స్, ఎక్స్ట్రీమ్లీ స్పెల్స్ అంటాం. తెలంగాణలో వర్షపాతం పెరుగుతోంది. దానికి కారణం ఇంటర్లాక్ రీజియన్. బంగాళాఖాతం, అరేబియా ఉండడం, రెండు వైపుల నుంచి గాలులు వీయడం వల్ల రాత్రికి రాత్రి కురుస్తాయి. వాటిని హెవీ రెయిన్స్ అంటాం. ఓరో-గ్రఫీ ఇంపాక్ట్ కాదు కాబట్టి క్లౌడ్ బరస్ట్ అనం. ఇప్పటివరకు అయితే మూడు లేదా నాలుగు గంటల్లో 20 సెంటీమీటర్లు పడింది.
భాగిస్తే.. ఒక్క గంటలో 10 సెంటీమీటర్లు పడలేదు. అక్కడ ఎక్కువ వర్షాలు ఎందుకు పడ్డాయంటే అది ఫారెస్ట్ ఏరియా. వెజిటేషన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే నీటి నిల్వలు ఉన్నాయి. ఈ కారణాల వల్ల కూడా వర్షాలు ఎక్కువగా పడతాయి. రూరల్ ఏరియాల్లో ఇలా ఉంటే అర్బన్ ఏరియాల్లో కాంక్రీట్ జంగిల్స్, కెమికల్ రియాక్షన్స్, ఆ నగరానికి పరిమితమైన కాలుష్యాలు పరిసర ప్రాంతాలకు కూడా వెళ్తుండడం వల్ల అక్కడ కూడా ఎక్కువ వర్షం కురుస్తుంది.
మ్యాన్ మేడ్ చేంజెస్ అనేవి జరిగినప్పుడు కూడా వాటి ప్రభావం వాతావరణం మీద ఉంటుంది. కాబట్టి ఈ భారీ వర్షాలు, వరదల సమయంలో ఎటువంటి నష్టం జరగకుండా అప్రమత్తంగా ఉండాలి. భవిష్యత్తుకు వనరుల సమకూర్చే పరిస్థితుల్లో లేనప్పుడు ఉన్నవాటిని కాపాడుకోవడం అవసరం. ఆర్థిక నష్టం జరగకుండా సురక్షితంగా ఉండే మార్గాలు కనుగొనాలి.
డా. కె. నాగరత్న, డైరెక్టర్, వాతావరణ శాఖ, హైదరాబాద్