
హైదరాబాద్: వినాయకుడితో పాటు పొరపాటున ఐదు తులాల బంగారు గొలుసును నిమజ్జనం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసాబ్ చెరువు దగ్గర జరిగింది. హస్తినాపురానికి చెందిన స్థానికుల్లో ఒక ఫ్యామిలీ ఇంట్లో వినాయకుడిని పెట్టుకున్నరు. వినాయక విగ్రహానికి మెడలో ఐదు తులాల బంగారు గొలుసు వేసి మూడు రోజుల పాటు పూజలు చేశారు. ఇట్ల.. వినాయకుడి దగ్గర బంగారం పెట్టినా, వినాయకుడి మెడలో బంగారం వేసిన తర్వాత తిరిగి ధరించినా కాలం కలిసొస్తుందని, మంచి జరుగుతుందని కొందరి నమ్మకం. అట్లనే.. ఈ కుటుంబం కూడా ఇంట్లో పూజించిన గణేశుని మెడలో గోల్డ్ చైన్ వేసింది.
పూజలు తర్వాత శనివారం ఉదయం నిమజ్జనం కోసం తుర్కయాంజాల్ మాసాబ్ చెరువు దగ్గరకు ఈ ఫ్యామిలీ వెళ్లింది. వినాయకుడి మెడలో వేసిన ఐదు తులాల బంగారు గొలుసును మర్చిపోయి, పొరపాటున వినాయకుడితో పాటు బంగారు గొలుసును కూడా చెరువులో విగ్రహంతో పాటు నిమజ్జనం చేశారు. నిమజ్జనం చేసిన కొంతసేపటికి బాధితురాలికి గోల్డ్ చైన్ గుర్తొచ్చింది. ఇలా జరిగిందని.. అక్కడే ఉన్న మున్సిపల్ సిబ్బందికి చెప్పడంతో అలర్ట్ అయ్యి జేసీబీ సాయంతో వినాయకులను చెరువు నుంచి బయటకి తీయగా వినాయకుడి మెడలో గొలుసు కనిపించింది. దీంతో.. బాధితురాలు హమ్మయ్య అనుకుంది. మున్సిపల్ సిబ్బంది చేసిన సాయానికి బాధితురాలు థ్యాంక్స్ చెప్పింది.