చెన్నూరు SBI రూ. 13 కోట్ల స్కాం.. ప్రధాన నిందితుడు రవీందర్ దొరికిండు.!

చెన్నూరు SBI రూ. 13 కోట్ల స్కాం.. ప్రధాన నిందితుడు రవీందర్  దొరికిండు.!

 తెలంగాణలో సంచలనం సృష్టించిన మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడు నరిగే రవీందర్ ను  ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.   రవీందర్ ను  అదుపులోకి తీసుకుని  విచారిస్తున్నట్లు సమాచారం. 

ఆగస్టు 29న  మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేటు గోల్డ్ లోన్ సంస్థల్లో అర్ధరాత్రి వరకు పోలీసులు  సోదాలు నిర్వహించారు.  రవీందర్ తన మిత్రులతో ప్రైవేటు సంస్థల్లో పెట్టిన బంగారంను రికవరీకి చర్యలు చేపట్టారు అధికారులు.  ఇవాళ (ఆగస్టు 30)న  చెన్నూర్ పట్టణంలోని ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలో తనిఖీలు నిర్వహిస్తారని సమాచారం.  అయితే  పోలీసులు నిందితులను తీసుకొస్తున్నారని  తెలియడంతో భారీ ఎత్తున ముత్తూట్ ఫైనాన్స్ సంస్థకు తరలి వచ్చారు  బ్యాంక్ ఖాతాదారులు. ఒక్కసారిగా ముత్తూట్ ఫైనాన్స్ సంస్థకు రావడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.

మొత్తం రూ. 13 కోట్ల స్కాం

చెన్నూరు పట్టణంలోని ఎస్ బీ ఐ బ్యాంకులో గోల్డ్ ఫ్రాడ్ పై ఆగస్టు 23న  పోలీసులకు ఫిర్యాదు చేశారు అధికారులు. బ్యాంకులో మొత్తంగా రూ. 12 కోట్ల 61 లక్షల విలువైన  బంగారం, కోటి 10 లక్షల నగదు పోయినట్లు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో సుమారు 449 మంది కస్టమర్లు బంగారం తాకట్టు పెట్టి గోల్డ్‌‌ లోన్లు తీసుకోగా అందులో 402 మందికిపైగా గోల్డ్‌‌ మాయమైందని ఫిర్యాదు చేశారు. బ్యాంకు అధికారుల ఫిర్యాదు మేరకు 10 మంది అనుమానితుల పైన కేసు నమోదు చేశారు పోలీసులు.  ప్రధాన నిందితుడు బ్యాంకులో పనిచేసే క్యాషియర్  నరిగే రవీందర్ కీలకంగా వ్యవహరించారని పోలీసులు తెలిపారు.

10 మంది నిందితులు వీళ్లే..

నరిగే రవీందర్ : A1 
కొంగండి బీరేష్: A2
నరిగే సరిత:A3
నరిగే స్వర్ణ లత అలియాస్ గోపు:A4
ఉమ్మల సురేష్:A5
కొదటి రాజశేఖర్:A6
గౌడ సుమన్:A7
ఎసంపల్లి సాయి కిరణ్:A8
ఎల్. సందీప్:A9
మోత్కూరి రమ్య: A10