అల్లు కనకరత్నమ్మకు కడసారి వీడ్కోలు.. పాడె మోసిన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్.

అల్లు కనకరత్నమ్మకు కడసారి వీడ్కోలు..  పాడె మోసిన చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్.

దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య సతీమణి, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ తల్లి అల్లు కనకరత్నమ్మ (94) కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో శుక్రవారం అర్థరాత్రి తుదిశ్వాస విడిశారు. ఆమె మరణంతో అల్లు, కొణిదెల కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.  పలువురు సినీ, రాజకీయం ప్రముఖులు కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

కనకరత్నమ్మ  అంత్యక్రియలు శనివారం కోకాపేటలోని అల్లు ఫామ్‌హౌస్‌లో కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖుల సమక్షంలో జరిగాయి. ఈ అంత్యక్రియల్లో అల్లు కుటుంబ స‌భ్యులు అల్లు అర‌వింద్, అల్లు అర్జున్, మెగా కుటుంబ స‌భ్యులు చిరంజీవి, రామ్ చరణ్ త‌దిత‌రులు పాల్గోన్నారు. అంతకు ముందు అంత్యక్రియల్లో భాగంగా అల్లు అరవింద్ కుండను పట్టుకోగా, చిరంజీవి, అల్లు అర్జున్, రామ్ చరణ్, అల్లు అర్జున్ కుమారుడు అయాన్ పాడెను మోశారు.

అమ్మమ్మ చివరి చూపు కోసం మైసూరులో షూటింగ్ ఆపేసి రామ్ చరణ్ హుటాహుటిన హైదరాబాద్ చేరుకున్నారు. అదే విధంగా ముంబైలో ఉన్న అల్లు అర్జున్ కూడా వెంటనే హైదరాబాద్ వచ్చి, నానమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి భావోద్వేగానికి గురయ్యారు. ఈ అంత్యక్రియలకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా, దిల్ రాజు, దగ్గుబాటి వెంకటేష్, బోయపాటి శ్రీను, నాగ చైతన్య, వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, బన్నీ వాసు, త్రివిక్రమ్ శ్రీనివాస్, ఘట్టమనేని శేషగిరిరావు వంటి వారు హాజరై అల్లు కనకరత్నమ్మ పార్థివదేహానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

ALSO READ : అమ్మమ్మ ఆఖరి ప్రయాణంలో కన్నీటి పర్యంతమైన రామ్ చరణ్

అల్లు కనకరత్నమ్మ మృతి తెలుగు చలనచిత్ర పరిశ్రమలో విషాద ఛాయలు నింపింది. సినిమా పెద్దలను, కళాకారులను, కుటుంబ సభ్యులను ఆమె ఎలా ఆదరించేవారో గుర్తు చేసుకుంటూ పలువురు సంతాపం వ్యక్తం చేశారు. ఈ విషాద సమయంలో అల్లు, మెగా కుటుంబాలకు ధైర్యం కలగాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.