జూలూరుపాడు, వెలుగు : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఫర్నిచర్ ధ్వంసానికి యత్నించిన14 మందిపై శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. జూలూరుపాడుకు చెందిన యువకుడు అఖిల్, యువతి గంగ ప్రేమ పెండ్లి చేసుకున్నారు. మేజర్లమైన తమకు రక్షణ కల్పించాలని గురువారం జూలూరుపాడు పోలీసులను ఆశ్రయించారు. సమాచారం తెలియడంతో యువతి తల్లిదండ్రులు, బంధువులు సుమారు100 మంది దాకా పోలీస్ స్టేషన్వద్దకు వెళ్లారు.
యువతిని తమకు అప్పగించాలంటూ గొడవకు దిగడంతో పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. యువతి అభిప్రాయాన్ని తెలుసుకోగా.. ప్రేమించిన వ్యక్తితోనే జీవిస్తానని స్పష్టంచేసింది. దీంతో ఆగ్రహంతో ఆమె కుటుంబసభ్యులు, బంధువులు స్టేషన్ లోని ఫర్నిచర్ ధ్వంసానికి యత్నించారు. దీంతో కారకులైన14 మందిపై కేసు నమోదు చేశామని, సీసీ ఫుటేజ్ ల ఆధారంగా మరికొందరిని గుర్తించి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ బాదావత్ రవి తెలిపారు.
