అటవీ భూముల ఆక్రమణకు యత్నం.. గిరిజనులు, ఫారెస్టు సిబ్బంది మధ్య ఘర్షణ

అటవీ భూముల ఆక్రమణకు యత్నం.. గిరిజనులు, ఫారెస్టు  సిబ్బంది మధ్య ఘర్షణ

లింగంపేట, వెలుగు: కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం పర్మల్ల జీపీ పరిధి ఆగపల్లి తండాలో శనివారం రాత్రి అటవీ భూముల ఆక్రమణకు సంబంధించి ఘర్షణ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి.. కొంతమంది గిరిజనులు జేసీబీ సాయంతో అటవీ భూములను ఆక్రమించేందుకు యత్నించారు. సమాచారం అందడంతో ఎల్లారెడ్డి ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ చరణ్‌‌‌‌తేజ సిబ్బంది వెళ్లారు. జేసీబీని స్వాధీనం చేసుకునేందుకు యత్నించగా తండావాసులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. 

ఫారెస్టు సిబ్బంది పోలీసులకు తెలపగా లింగంపేట ఎస్ఐ దీపక్ కుమార్ సిబ్బందితో అర్ధరాత్రి 2 గంటల సమయంలో వెళ్లి ఇరువర్గాలను శాంతింప జేశారు. ఫారెస్టు సిబ్బంది రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు జేసీబీ స్వాధీనానికి వేచి చూశారు. తండావాసులు మాత్రం  అటవీ సిబ్బందికి అప్పగించకుండా వేరేచోటుకు తరలించారు. అటవీ భూముల ఆక్రమణల కోసం జేసీబీ సాయంతో ప్రయత్నించిన గిరిజనులపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని ఫారెస్టు రేంజ్ ఆఫీసర్ చరణ్‌‌‌‌తేజ స్పష్టంచేశారు. అటవీ అధికారులపై దాడికి యత్నించినవారిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు చెప్పారు.