
- నామినేషన్ విత్‌డ్రాల చివరి రోజు ఆదిలాబాద్‌లో హైడ్రామా
- సంబంధం లేని వ్యక్తితో విత్‌డ్రా చేయించేందుకు ప్రయత్నం
- అడ్డుకున్న బీజేపీ లీడర్లు.. కలెక్టరేట్ ఎదుట ధర్నా
- నల్గొండ, ఖమ్మం, కరీంనగర్లో బుజ్జగింపులు, బేరసారాలు
- వెనక్కి తగ్గని ఇండిపెండెంట్లు
లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాచికలు పారలేదు. పన్నెండుకు పన్నెండు సీట్లను ఏకగ్రీవంగా దక్కించుకోవాలని ఆ పార్టీ ఎన్ని ఎత్తులు వేసినా ఆరు చోట్ల చిత్తయ్యాయి. ఇతరులు ఎవరూ పోటీలో ఉండొద్దని మొదటి నుంచీ టీఆర్ఎస్ లీడర్లు అస్త్రశస్త్రాలను ప్రయోగించారు. నామినేషన్ వేయకుండా ఇండిపెండెంట్లను అడ్డుకోవడం, ఫోర్జరీ సంతకాలు అంటూ కేసులు పెట్టించడం, తాయిలాలు ఆశచూపడం.. ఇట్లా అన్ని ప్రయత్నాలు చేసినా కరీంనగర్‌లోని రెండు, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండలోని ఒక్కో స్థానంలో పోటీ ఖాయమైంది.
నెట్వర్క్ / హైదరాబాద్, వెలుగు: లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్ని సీట్లను ఏకగ్రీవం చేసుకోవాలని టీఆర్ఎస్ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. మొత్తం 12 సీట్లలో ఆరు స్థానాల్లో మాత్రమే ఆ పార్టీ అభ్యర్థులు ఏకగ్రీవమయ్యారు. మరో ఆరు స్థానాల్లో 26 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల విత్ డ్రాకు చివరి రోజైన శుక్రవారం ఆదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో రోజంతా బేరసారాలు, హైడ్రామాలు నడిచాయి. ఆదిలాబాద్‌లోనైతే ఎన్నికలతో సంబంధం లేని ఓ వ్యక్తిని తీసుకొచ్చి.. ఇండిపెండెంట్ క్యాండిడేట్ పెందూర్ పుష్పను బరిలో నుంచి తప్పించే ప్రయత్నాలు జరిగాయి. ఆమెను తప్పిస్తే తమ అభ్యర్థి ఎన్నిక ఏకగ్రీవమవుతుందని భావించారు. కానీ, టీఆర్ఎస్ తీరుపై పుష్ప, ఆమెకు మద్దతిచ్చిన తుడుందెబ్బ నేతలు, బీజేపీ లీడర్లు పోరాడడంతో.. పుష్ప కూడా బరిలో ఉన్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. మొత్తంగా కరీంనగర్లో రెండు, నల్గొండ, ఆదిలాబాద్, ఖమ్మం, మెదక్‌లోని ఒక్కో స్థానానికి డిసెంబర్ 10న పోలింగ్‌జరగనుంది. అదే నెల 14న కౌంటింగ్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని రెండు, మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోని ఒక్కో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. అదే నెల 14న కౌంటింగ్ ఉంటుంది. రంగారెడ్డి జిల్లాలోని రెండు, మహబూబ్‌నగర్ జిల్లాల్లోని రెండు, నిజామాబాద్, వరంగల్‌లోని ఒక్కో స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు.
నల్గొండలో డీల్ అంటూ డ్రామా
ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు నుంచే ఏకగ్రీవాలపై టీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. ఇతరులు ఎవరూ నామినేషన్లు వేయకుండా అన్ని ప్రయత్నాలు చేసింది. నామినేషన్ల టైంలో రంగారెడ్డి జిల్లాలోనైతే ఓ ఇండిపెండెంట్ అభ్యర్థి నామినేషన్ పత్రాలను కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు చించివేశారు. నామినేషన్ల విత్‌డ్రాకు చివరిరోజైన శుక్రవారం నల్గొండలో రోజంతా హైడ్రామా నడిచింది. ఇండిపెండెంట్లు నగేశ్, లక్ష్మయ్య విత్డ్రాచేసుకునేందుకు కోటి రూపాయలతో డీల్ కుదిరిందని టీఆర్ఎస్ లీడర్లు ప్రచారం చేశారు. మిగిలిన నలుగురు క్యాండిడేట్లకు ఒక్కొక్కరికి ఐదు లక్షల చొప్పున ప్యాకేజీ మాట్లాడామన్నారు. టీఆర్ఎస్ లీడర్ల నుంచి ఒత్తిళ్లు వస్తాయని గురువారం సాయంత్రం నుంచే నగేశ్తన ఫోన్ స్విచాఫ్ చేసి అందుబాటులో లేకుండా పోయారు. ఆయన జాడకనిపెట్టేందుకు పోలీస్ డిపార్ట్మెంట్సాయంతో సెల్‌సిగ్నల్స్ ఆధారంగా ట్రేస్ చేసి శ్రీశైలంలోని అమ్రాబాద్ ఏరియాలో ఉన్నట్లు గుర్తించారు. నగేశ్ కోసం ఓ ఏజెంట్‌ను పంపించామని టీఆర్ఎస్ లీడర్లు మైండ్‌గేమ్ ఆడారు. ఇక లక్ష్మయ్యతో విత్‌డ్రా చేయించేందుకు బుర్రి శ్రీనివాస్ రెడ్డి, గుమ్మల మోహన్ రెడ్డితో కోటి రూపాయలు ఇస్తామని టీఆర్ఎస్ లీడర్లు బేరసారాలు సాగించారు. కానీ అప్పటికే లక్ష్మయ్య సూర్యాపేట సమీపంలోని ఓ రెస్టార్టెంట్లో తలదాచుకున్నారు. మిగిలిన నలుగురు క్యాండిడేట్లతో నామినేషన్లను విత్‌డ్రా చేయించేందుకు ఒప్పించిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు వాళ్లను వెంట బెట్టుకుని కలెక్టరేట్ వెళ్లారు. కానీ నగేశ్, లక్ష్మయ్య విత్‌డ్రా చేసుకోవడం లేదని తెలిసి వారిని తిప్పి పంపారు. నల్గొండ ఎమ్మెల్సీ బరిలో టీఆర్ఎస్ అభ్యర్థి కోటిరెడ్డితోపాటు మొత్తం ఏడుగురు నిలిచారు.
ఏకగ్రీవాలు ఇలా..
వరంగల్ జిల్లాలోని ఒక్క ఎమ్మెల్సీ స్థానానికి మొత్తం 14 మంది నామినేషన్లు వేయగా.. 10 మంది నామినేషన్లు రిజెక్ట్ కాగా, మరో ముగ్గురు విత్ డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థి పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నిజామాబాద్ స్థానం నుంచి నామినేషన్ల స్ర్కూటినీ టైంకు ఒక్కటే నామినేషన్ మిగిలింది. దీంతో అదే స్థానం నుంచి ఎమ్మెల్సీగా కొనసాగుతున్న కవిత ఏకగ్రీవమయ్యారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రెండు స్థానాల్లో టీఆర్ఎస్ అభ్యర్థులు పట్నం మహేందర్ రెడ్డి, శంభీపూర్ రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మహబూబ్‌నగర్ జిల్లాలోని రెండు స్థానాలు టీఆర్ఎస్ ఖాతాలోకి చేరాయి. పోటీకి దిగిన ఒక ఇండిపెండెంట్ శ్రీశైలం నామినేషన్ విత్‌డ్రా చేసుకున్నారు. దీంతో టీఆర్ఎస్ అభ్యర్థులు కసిరెడ్డి నారాయణరెడ్డి, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి ఏకగ్రీవమయ్యారు. ఏకగ్రీవమైనవారికి గెలుపు సర్టిఫికెట్లను శుక్రవారం ఎన్నికల ఆఫీసర్లు అందజేశారు. దాదాపు ఏకగ్రీవమైన అన్ని స్థానాల్లో నామినేషన్ వేసిన పలువురు ఇండిపెండెంట్లను సంతకాల ఫోర్జరీ పేరిట ఆఫీసర్లు రిజెక్ట్చేయడంపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
బుజ్జగింపులు, ఆఫర్లు!
కరీంనగర్లో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు 24 మంది పోటీపడగా.. టీఆర్ఎస్ నేతలు బుజ్జగింపులు, బేరసారాల తర్వాత 14 మందితో విత్ డ్రా చేయించారు. విత్ డ్రా చేసుకున్న అందరికీ రూ. 5 లక్షల చొప్పున అందించారని ప్రచారం జరిగింది. మాజీ మేయర్, టీఆర్ఎస్ రెబల్ సర్దార్ రవీందర్ సింగ్ తో విత్‌డ్రా చేయించడం సాధ్యం కాకపోవడంతో టీఆర్ఎస్ లీడర్లు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. ఇక్కడి రెండు స్థానాల్లో టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, టి. భానుప్రసాద్ సహా 10 మంది పోటీలో నిలిచారు.
ఖమ్మంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ క్యాండిడేట్లతోపాటు ఇద్దరు ఇండిపెండెంట్లు పోటీలో ఉన్నారు . ముగ్గురితో నామినేషన్లు విత్ డ్రా చేయించేందుకు టీఆర్ఎస్ లీడర్లు మూడురోజులుగా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారీ మొత్తంలో ఆఫర్ ఇస్తామన్నా తిరస్కరించడంతో ఇక్కడ పోటీ తప్పలేదు. మెదక్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి తూర్పు నిర్మల బరిలో ఉండడంతో ఏకగ్రీవ ప్రయత్నాలను టీఆర్ఎస్నేతలు ఉపసంహరించుకున్నారు. ఆమెతో పాటు టీఆర్ఎస్ క్యాండిడేట్ డాక్టర్ యాదవ రెడ్డి, దుబ్బాకకు చెందిన ఇండిపెండెంట్ అభ్యర్థి మట్ట మల్లారెడ్డి బరిలో ఉన్నారు.