
పాలిటెక్నిక్ సెమిస్టర్ పరీక్షలు దగ్గరపడ్డాయి. పరీక్ష ఫీజుకు నోటిఫికేషన్ కూడా వచ్చింది. కానీ, 21 వేల మంది విద్యార్థుల నుంచి ఫీజును తీసుకునేందుకు అధికారులు ససేమిరా అంటున్నారు . కారణం, సరిపడా హాజరు లేకపోవడం. బయోమెట్రిక్ హాజరే విద్యార్థులకు ఈ గండాన్ని మోసుకొచ్చింది. రాష్ర్టంలో 172 పాలిటెక్నిక్ కాలేజీలుండగా, వీటిలో 57 ప్రభుత్వ కళాశాలలు. మొత్తం 68,035 మంది విద్యార్థులున్నారు . ఈ విద్యాసంవత్సరం నుంచి బయోమెట్రిక్ హాజరు విధానాన్ని సాంకేతిక విద్యాశాఖ తీసుకొచ్చింది. గత ఏడాది జూన్ లో ప్రణాళికలు తయారు చేసి, సెప్టెంబర్ నుంచి అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. అన్ని కాలేజీలకు 740 బయోమెట్రిక్ పరికరాలను అందించింది. ఒక్కో దాంట్లో వంద మంది విద్యార్థుల హాజరుకు అవకాశం కల్పించింది.
సాంకేతిక విద్యాశాఖ అధికారులు బయోమెట్రిక్ పై సీరియస్ గా ఉన్నా, కాలేజీ యాజమాన్యాలు పెద్దగా పట్టించుకోలేదు. విద్యార్థులకు వాటిపై కనీస అవగాహన కల్పించలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి . ఈ నెల 22 నుంచి ఫస్టియర్ విద్యార్థులకు సెకండ్ సెమిస్టర్ , సెకండియర్ విద్యార్థులకు ఫోర్త్ సెమిస్టర్ పరీక్షలుయి. కనీసం 75 శాతం హాజరు ఉంటేనే అనుమతిస్తారు. మెడికల్ సర్టిఫికెట్ ఇస్తే పది శాతం హాజరు మినహాయింపు ఉంటుంది. హాజరు లేనివారికి అనుమతివ్వొద్దని ఫిబ్రవరిలో అధికారులు ఆదేశించారు. గురువారంతో ఫీజు గడువు ముగుస్తుంది. ఈ సెమిస్టర్ కు విద్యార్థులకు అవకాశమిచ్చి, వచ్చే సెమిస్టర్ నుంచి బయోట్రిక్ విధానం అమలు చేయాలని డిప్లొమా స్టూడెంట్స్ యూనియన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎరవెల్లి జగన్ కోరారు.