
హైదరాబాద్: హీరో విజయ్ దేవరకొండ మరో వివాదంలో చిక్కుకున్నారు. విజయ దేవరకొండపై కేసు నమోదు చేయాలని న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్ ఎస్ఆర్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇటీవల సూర్య నటించిన రెట్రో సినిమా ఈవెంట్లో విజయదేవరకొండ మాట్లాడుతూ ఆదివాసీలను అవమానించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఉద్దేశపూర్వకంగా ఆదివాసీలను అవమానించిన అతడిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాని కోరాడు. న్యాయవాది కిషన్ లాల్ చౌహాన్ ఫిర్యాదును ఎస్ఆర్ పోలీసులు పరిశీలిస్తున్నారు.
అసలు విజయ్ ఏమన్నాడంటే..?
హీరో సూర్య నటించిన తాజా చిత్రం రెట్రో. ఇటీవల హైదరాబాద్‌లో ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా హాజరైన విజయ్ పహల్గాం టెర్రర్ ఎటాక్‌పై స్పందించాడు. ఈ క్రమంలోనే గిరిజనులపై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ‘టెర్రరిస్ట్ కొడుకులకు కూడా సరైన విద్య చిన్నప్పటి నుంచి ఇప్పించలేదు కాబట్టే ఇలా బ్రెయిన్ వాష్ అవ్వకుండా ఉన్నారు. 500 ఏళ్ల క్రితం గిరిజనులు (ట్రైబల్స్) ఘర్షణ పడినట్లుగా కశ్మీర్‌లో దాడులు, విధ్వంసం సృష్టిస్తూ ఇప్పటికీ అలా కామన్ సెన్స్ లేకుండా, బుద్ధి లేకుండా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారు’’ అని కామెంట్స్ చేశాడు.
విజయ్ వ్యాఖ్యలుపై వివాదానికి దారి తీశాయి. గిరిజనులు హీరో కామెంట్స్‌పై భగ్గుమంటున్నారు. ట్రైబల్స్ అనే పదం వాడటంపై అభ్యంతరం వ్యక్తం చేసిన గిరిజన సంఘాలు.. ఉగ్రవాదుల దాడులను గిరిజనులతో పోల్చడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. ఆ వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని.. గిరిజనులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే లాయర్ కిషన్ విజయ్ దేవరకొండపై ఫిర్యాదు చేశాడు.