
హైదరాబాద్, వెలుగు: ఎస్సీ గురుకులాల్లో నిధుల గోల్మాల్ జరిగినట్లు ఆడిట్ రిపోర్ట్ లో వెల్లడైంది. 2017=2020 మధ్య ఫండ్స్ దుర్వినియోగం జరిగినట్లు అధికారులు తేల్చారు. కోడింగ్ స్కూళ్ల ప్రాజెక్టులో రూ.4 కోట్లు ఖర్చు చేస్తే రూ. 92 లక్షలు పనులు జరగకున్నా ఆయా కంపెనీలకు చెల్లించినట్లు గుర్తించారు. కేవలం రెండు స్కూళ్లకు మాత్రమే అనుమతి ఉన్నా, ఒప్పందంలో స్థలాలు , స్కూళ్ల సంఖ్య వివరించకుండా ఎంవోయూ కుదుర్చుకున్నారని, టెండర్లు ఈ-ప్రోక్యూర్మెంట్ ద్వారా నిర్వహించకపోవడం, విద్యార్థుల సంఖ్య, సిబ్బంది అర్హతల వంటి కీలక నిబంధనలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆడిట్ అధికారులు తప్పుపట్టారు. బ్యాంక్ గ్యారంటీ లేకుండానే 90 శాతం అడ్వాన్స్ లు చెల్లించాలని , ఇది ప్రభుత్వ రూల్స్ కు విరుద్ధమని ఎత్తి చూపారు.
టాపర్ లైసెన్స్ లు ప్రాజెక్టులో పర్మిషన్లు తీసుకోకుండా రూ. 20.29 కోట్లు ఖర్చు చేశారని, లైసెన్సుల వినియోగంపై ఎటువంటి డేటా లేకుండా, ఏజెన్సీకి రూ.2.03 కోట్లు చెల్లించారని రిపోర్ట్ లో ఆడిట్ అధికారులు పేర్కొన్నారు. క్వాలిటీ లేని యూనిఫార్మ్ లకు రూ.9.33 కోట్లు చెల్లించారని, ప్రభుత్వ గైడ్ లైన్స్ కు అనుగుణంగా లేకున్నా సొసైటీ ఆ యూనిఫార్మ్ లను తీసుకొని స్టూడెంట్స్ కు పంపిణీ చేశారని వెల్లడైంది. 2017-=18లో అనుమతించిన రేట్లకు బదులుగా 2021 రేట్లను అమలు చేయటం ద్వారా రూ.76.89 లక్షల అధికంగా చెల్లించారు. విద్యుత్ సామగ్రి కొనుగోళ్లల్లో రూ. 1.38 కోట్లు ఐఎస్ఐ సర్టిఫికేట్లు లేని కంపెనీలకు చెల్లించినట్లు వెల్లడైంది.