గృహలక్ష్మి అప్లికేషన్లు.. ఆగస్టు10 వరకు లాస్ట్ డేట్!

గృహలక్ష్మి అప్లికేషన్లు..  ఆగస్టు10 వరకు లాస్ట్ డేట్!

హైదరాబాద్, వెలుగు: సొంత జాగాలో ఇంటి నిర్మాణానికి ప్రభుత్వం అందించనున్న ఆర్థిక సాయం (గృహలక్ష్మి స్కీమ్​) కోసం  అప్లికేషన్లు మొదలయ్యాయి. పబ్లిక్ నుంచి అప్లికేషన్లు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు సీఎస్​ మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తున్నది. ఈ నెల 10 చివరి తేదీగా ఖరారు చేసినట్లు సమాచారం. దరఖాస్తుల్లో ఉన్న సమాచారం ప్రకారం ఈ నెల 20 నుంచి గ్రామాలు, మున్సిపాలిటీల్లో వెరిఫికేషన్ స్టార్ట్ చేసి ఈనెల 25 వ తేదీ నుంచి ఎంపికయిన లబ్ధిదారులకు శాంక్షన్​లు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది. వెరిఫికేషన్ తరువాత యాప్, పోర్టల్​లో మహిళకు సంబంధించి సమాచారం, ఫొటో, ఆధార్, ప్రత్యేక బ్యాంక్ అకౌంట్ నంబర్, అన్ని వివరాలను అప్​లోడ్ చేయనున్నారు.

 దీంతో ఈ స్కీమ్​కు అన్ని జిల్లాల్లో ఇప్పటి వరకు 10 వేల అప్లికేషన్లు వచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. నిధుల కొరతతో స్కీమ్​ను ప్రారంభించేందుకు ప్రభుత్వం వెనకడుగు వేసింది. అయితే ఇటీవల కోకాపేట భూముల వేలం, ఓఆర్ఆర్ టెండర్ నిధులతో చేతికందడంతో పంటరుణాల మాఫీ, గృహలక్ష్మి, దళిత బంధు స్కీమ్​లను వేగంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికలకు తక్కువ టైమ్ ఉండటంతో వీటిని వచ్చే నెల చివరి నాటికి లబ్ధిదారులకు అందజేయాలని నిర్ణయించినట్లు తెలుస్తున్నది.

 సర్కారు జీవోలు విడుదల చేయలే

గృహలక్ష్మి స్కీమ్​ను ప్రకటిస్తూ జూన్ 21న ఆర్ అండ్ బీ సెక్రటరీ విజయేంద్ర బోయి జీవో విడుదల చేశారు. స్కీమ్​కు అర్హతలపై పలు గైడ్ లైన్స్ కూడా పేర్కొన్నారు. స్కీమ్ అమలు, ఇతర అంశాలపై తర్వాత జీవో లు ఇస్తారని అనుకున్నప్పటికీ ఇంత వరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఉత్తర్వులు విడుదల కాలేదు. స్కీమ్ అమలు కోసం అప్లికేషన్ ఫామ్​ను హౌసింగ్ అధికారులు రెడీ చేసినా ఇంత వరకు సీఎం ఫైనల్ చేయలేదు. మరో వైపు స్కీమ్ అమలుకు యాప్, పోర్టల్​ను డెవలప్ చేసే బాధ్యతను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ( సీజీజీ)కు ప్రభుత్వం జీవో ఇచ్చిన రోజే అప్పగించింది. ఈ రెండు పనులు కూడా చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తున్నది.

డబుల్ బెడ్ రూమ్​లు కూడా పంపిణీ

ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండటంతో డబుల్  బెడ్రూమ్​ ఇండ్లను సైతం పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మూడేండ్ల కింద పూర్తయినా ఇంత వరకు పంపిణీ చేయకపోవడంతో ప్రభుత్వం, అధికారపార్టీపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని ఇంటెలిజెన్స్ అధికారులు రిపోర్ట్ ఇచ్చినట్లు సమాచారం. దీంతో ఇటీవల మంత్రి కేటీఆర్ గ్రేటర్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించి  ఈనెల, వచ్చే నెల, అక్టోబర్​లో పూర్తి అయిన ఇండ్లకు లబ్ధిదారులను ఎంపిక చేసి ఇండ్ల పంపిణీ చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో కూడా పూర్తయిన ఇండ్లకు లబ్ధిదారులను అధికారులు ఎంపిక చేశారు. అన్ని జిల్లాల్లో కలిపి (గ్రేటర్ మినహా) 65 వేల మంది ఎంపిక అయినట్లు అధికారులు చెబుతున్నారు. త్వరలో పంపిణీపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వనున్నట్లు తెలుస్తున్నది.