- ప్రభుత్వ భూముల ఆక్రమణలపై సమగ్ర నివేదిక అందించాలి
- ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
ఖమ్మం టౌన్, వెలుగు : భూ సర్వే జనవరి 15 వరకు పూర్తి చేయాలని ఖమ్మం కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో భూ సర్వే పనులపై మండలాల వారీగా ఆయన సమీక్షించి పలు సూచనలు చేశారు. మండలాల వారీగా సర్వేయర్ పని తీరును సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడి రెగ్యులర్ గా రివ్యూ చేయాలని ఆదేశించారు.
దరఖాస్తుల్లో అధికంగా తిరస్కరించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు తిరస్కరించారో కారణాలు పేర్కొనాలని, లేకపోతే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రస్తుతం భూ భారతిలో ప్రభుత్వ భూమి ఎంత అందుబాటులో ఉందో వివరాలు సమర్పించాలన్నారు. సమావేశంలో ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శ్రీనివాసులు, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, మండల సర్వేయర్లు పాల్గొన్నారు.
వైవిధ్యమైన పంటలను ప్రోత్సహించాలి..
వ్యవసాయ ఖర్చులు ఏటేటా పెరుగుతున్నందున రైతుల అవసరాల మేరకు పంట రుణాల పరిమితి నిర్ణయించాలని, సహకార బ్యాంకుల ద్వారా అవసరమైన రుణాలు ఇవ్వాలని డీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్చార్జ్ చైర్మన్, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అన్నారు. ఖమ్మం జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ పరిధిలో ఈ సంవత్సరానికి సంబంధించి పంట రుణాల పంపిణీని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు సమావేశ మందిరంలో ఆయన సమీక్షించారు.
ముందుగా డీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్చార్జ్ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించి, తర్వాత బ్యాంకును సందర్శించారు. నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, సాగునీరు, కూలీల ఖర్చులు, యంత్రాల అద్దె లాంటి అంశాల ఆధారంగా ఆఫ్ ఫైనాన్స్ ఉండాలన్నారు.
