ట్రంప్ లాగే చైనా సెల్ఫ్ డబ్బా: ఇండియా–పాక్ వార్ మేమే ఆపామంటూ డ్రాగన్ కంట్రీ గొప్పలు

ట్రంప్ లాగే  చైనా సెల్ఫ్ డబ్బా: ఇండియా–పాక్ వార్ మేమే ఆపామంటూ డ్రాగన్ కంట్రీ గొప్పలు

బీజింగ్: భారత్–పాక్ యుద్ధాన్ని తానే ఆపానంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్న విషయం తెలిసిందే. తాజాగా భారత పొరుగు దేశం చైనా కూడా ట్రంప్ రాగం అందుకుంది. భారత్–పాక్ మధ్య ఉద్రిక్తతలను తగ్గించేందుకు మేమే మధ్యవర్తిత్వం వహించామని డ్రాగన్ కంట్రీ గొప్పలు చెప్పుకుంటోంది. ఈ మేరకు అంతర్జాతీయ ప్రస్తుత పరిస్థితులు, చైనా విదేశీ సంబంధాలపై బీజింగ్‎లో జరిగిన ఓ సమావేశంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ మాట్లాడుతూ.. 2025, మే నెలలో భారతదేశం-పాకిస్తాన్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతలు తగ్గించేందుకు చైనా మధ్యవర్తిత్వం వహించిందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ప్రపంచంలో అస్థిరత నెలకొంది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఎన్నడూ లేని విధంగా ఈ సంవత్సరం స్థానిక యుద్ధాలు, సరిహద్దు ఘర్షణలు పెరిగాయి. భౌగోళిక రాజకీయ అల్లకల్లోలం వ్యాప్తి చెందుతూనే ఉంది. అంతర్జాతీయ సంఘర్షణలను పరిష్కరించి శాంతి నెలకొల్పడంలో చైనా న్యాయమైన వైఖరిని అవలంబించింది. ఇండియా–పాక్, పాలస్తీనా–ఇజ్రాయెల్, కాంబోడియా–థాయ్ లాండ్ వివాదాల్లో మధ్యవర్తిత్వం వహించాం” అని వాంగ్ పేర్కొన్నారు. 

ఇండియా–పాక్ యుద్ధాన్ని తానే ఆపానని ట్రంప్ పదే పదే చెప్పుకుంటున్నప్పటికీ.. ప్రతిసారి అతడి వ్యాఖ్యలను భారత్ తిరస్కరిస్తూ వస్తోంది. ద్వైపాక్షిక చర్చల ద్వారానే ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను పరిష్కరించుకున్నామని.. కాల్పుల విరమణ ఒప్పందంలో మూడో వ్యక్తి/దేశ ప్రమేయం లేదని భారత్ స్పష్టం చేసింది. ఈ తరుణంలో ట్రంప్ మాదిరిగానే ఇండియా–పాక్ మధ్య మధ్యవర్తిత్వం వహించామని చైనా పేర్కొనడం ప్రపంచ దేశాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ట్రంప్ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడూ తిప్పికొడుతూ వస్తోన్న ఇండియా.. డ్రాగన్ కంట్రీ కామెంట్ పై ఏ విధంగా  రియాక్ట్ అవుతుందో చూడాలీ.