జూలూరుపాడు, వెలుగు : అక్రమంగా కలపను నిల్వ ఉంచిన బీట్ ఆఫీసర్ పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎఫ్ఓ కోటేశ్వరావు తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని ఎఫ్ఆర్ఓ కార్యాలయంలో పట్టుకున్న కలపను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నర్సరీలో ఎండిపోయిన టేకు, నారవేప చెట్లను నరికి ఆ దిమ్మెలను పై అధికారులకు సమాచారం ఇవ్వకుండా బీట్ ఆఫీసర్ ఇంటికి తరలించారు.
సమాచారం మేరకు ఫారెస్ట్ సిబ్బంది ఆదివారం రాత్రి పాపకొల్లు గ్రామంలోని ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన టేకు, నారవేప దిమ్మెలను పట్టుకుని ఎఫ్ఆర్ఓ కార్యాలయానికి తరలించారు. వాటి విలువ సుమారు 28,500 ఉంటుంది. ఈ కార్యక్రమంలో ఎఫ్ఆర్ఓ ప్రసాదరావు, సిబ్బంది పాల్గొన్నారు.
