మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా బోనకల్ మండలం ముష్టికుంట్ల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం వద్ద యూరియా కోసం రైతులు నిలబడిన క్యూలైన్లో మంగళవారం తోపులాట చోటు చేసుకుంది. సహకార సంఘం పరిధిలో ముష్టికుంట్ల, చొప్పకట్లపాలెం, రామాపురం గ్రామాల్లో రైతులు సుమారు 4,000 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశారు.
ప్రస్తుతం మొక్కజొన్న ఎదుగుదల దశలో ఉండటంతో యూరియా అవసరం చాలా ఎక్కువగా ఉంది. అయితే, ఈ సొసైటీకి కేవలం 4 లారీల యూరియా 1,680 బస్తాలు మాత్రమే సరఫరా కావడంతో సమస్య మొదలైంది. యూరియా వచ్చిన విషయం తెలియడంతో మహిళా రైతులు, వృద్ధులు, చిన్నారులతో సహా సుమారు 300మదికి పైగా రైతులు ఒక్కసారిగా సొసైటీ వద్దకు చేరుకున్నారు.
గతంలో ఎరువులు తీసుకున్న వారు కూడా మళ్లీ క్యూ లైన్లోకి రావడంతో రైతుల మధ్య వాదోపవాదాలు జరిగి తోపులాట జరిగింది. వెంటనే సహకార సంఘం సిబ్బంది పోలీసులకు సమాచారం అందించి కార్యాలయానికి తాళాలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో రైతులు మరింత ఆందోళనకు గురయ్యారు.
ఈ సమాచారం తెలుసుకున్న మండల వ్యవసాయ అధికారి పసులూరి వినయ్ అక్కడికి చేరుకోగా, రైతులను ఇబ్బంది పెట్టకుండా సాగు విస్తీర్ణం ఆధారంగా అవసరమున్న రైతులను గుర్తించి పారదర్శకంగా యూరియా పంపిణీ చేయాలని రైతులు కోరారు. తోపులాట జరగకుండా ప్రతి రైతుకు యూరియా అందేలా కూపన్లు పంపిణీ చేస్తున్నామని, రైతులందరికీ యూరియా పంపిణీ చేస్తామని మండల వ్యవసాయాధికారి హామీ ఇచ్చారు.
